డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఐటమ్ బాంబ్ ముమైత్‌ఖాన్, ఆ సమయంలో బిగ్‌బాస్ రియాల్టీ షోలో పాల్గొంటుండగా, ఆమెను బిగ్ హౌస్ నుంచి విచారణ నిమిత్తం బయటకు తీసుకురావాల్సి వచ్చింది. విచారణకు హాజరైన ముమైత్‌ఖాన్, ఆ తర్వాత తిరిగి బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్ళిందనుకోండి.. అది వేరే సంగతి. బిగ్ బాస్ సీజన్ వన్ నాటి వ్యవహారమది.
తాజాగా, మరోసారి బిగ్ హౌస్ పార్టిసిపెంట్‌కి అలాంటి పరిస్థితి ఎదురయ్యేలా వుంది. బిగ్ హౌస్ నుంచి బాబు గోగినేని బయటకు వచ్చి, పోలీసు విచారణకు హాజరవక తప్పేలా కన్పించడంలేదు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనీ, మతాల మధ్య చిచ్చుపెట్టేలా వ్యవహరించడంతోపాటు, దేశద్రోహానికి పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో బాబు గోగినేనిపై కేసు నమోదయ్యింది. ఈ కేసుకు సంబంధించి న్యాయస్థానం తాజాగా నోటీసులు జారీ చేసింది.
ప్రస్తుతం బిగ్ బాస్ రియాల్టీ షోలో వున్న బాబు గోగినేనికి డైరెక్ట్‌గా ఆ నోటీసులు అందే అవకాశం లేదు. బిగ్ బాస్ నిర్వాహకుల ద్వారా ఆ నోటీసులు ఆయనకు వెళతాయి. నోటీసులు అందుకున్నాక, ఆయన సమాధానం ఇచ్చితీరాలి. మరి, బిగ్ హౌస్ నుంచి ముమైత్‌ఖాన్ తరహాలో ఒకరోజు వెసులుబాటు బాబు గోగినేనికి దొరుకుతుందా.? ఎలిమినేట్ చేసేసి, ఆయన్ని నిర్వాహకులు బయటకు పంపుతారా.? అన్నది వేచి చూడాల్సిందే.