సైరా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ చుట్టూ ఎంత గందరగోళం కొనసాగాలో అంతా నడుస్తోంది. మొన్నటికిమొన్న వేదికపై గందరగోళం చెలరేగింది. అంతా ఓకే అనుకునే టైమ్ కు ఇప్పుడు తేదీపై సస్పెన్స్ పడింది. అవును.. సైరా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ డేట్ మారింది. అంతా అనుకుంటున్నట్టు ఈ బుధవారం ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లేదు.
నిజానికి ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను 15న పెట్టాలనుకున్నారు. కానీ ఆ తేదీ నుంచి కాస్త పక్కకు జరిగి 18వ తేదీని ఫిక్స్ చేశారు. ఇప్పుడు ఆ తేదీని కూడా రద్దుచేశారు. ప్రస్తుతానికైతే 22 అనుకుంటున్నారు. ఇది కూడా ఇంకా అఫీషియల్ గా కన్ ఫర్మ్ కాలేదు.
మొన్నటికిమొన్న వేదిక విషయంలో కూడా ఇదే కన్ఫ్యూజన్. ముందు కర్నూల్ అనుకున్నారు. నరసింహారెడ్డి రేనాడు ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టి, కర్నూల్ లో ఈవెంట్ నిర్వహిస్తే సబబుగా ఉంటుందని భావించారు. కానీ తర్వాత ఆ వేదికను రద్దుచేశారు. మధ్యలో విజయవాడ, విశాఖపట్నం పేర్లు కూడా నలిగాయి. ఫైనల్ గా హైదరాబాద్ ఎల్బీ స్టేడియం ఫిక్స్ చేశారు. అంతా ఓకే అనుకున్న టైమ్ కు ఇప్పుడు తేదీ మారిపోయింది.
రాజమౌళి, వినాయక్, పవన్ కల్యాణ్, కేటీఆర్ లాంటి ప్రముఖుల్ని ఈ వేడుకకు ఆహ్వానించారు. కేటీఆర్ రాలేనని ఇప్పటికే స్పష్టంచేశారు. ఇప్పుడు తేదీ మారడంతో.. 22కి ఆయన వస్తారేమో చూడాలి. ఇంతకీ ఫంక్షన్ డేట్ ఎందుకు మార్చారనే విషయంపై ఇంకా యూనిట్ నుంచి క్లారిటీ రాలేదు.