రాను రాను టెక్నాలజీ పెరుగుతోంది. అనేక సంస్థలు తమ టెక్నాలజీని సినిమా రంగానికి వాడుకునే విధంగా మార్చుతున్నాయి. మొన్నటికి మొన్న బాహుబలి ప్రచారం కోసం ఆధునిక టెక్నాలజీ వాడారు. అలాగే నేనే రాజు నేనే మంత్రి స్టాండ్స్ కోసం కొత్త టెక్నాలజీ జోడించారు. ఇప్పుడు ఓ సంస్థ కొత్త ప్రయోగానికి తెర తీస్తోంది. ఒకే భాషలో తీసిన సినిమాను పలు భాషల్లో చూసే విధంగా తయారుచేయడం.
అదెలా అంటే, ఒక భాషలో తీసిన సినిమాకు అన్ని భాషల్లో అనువాద సంభాషణలు రెడీ చేస్తారు. డబ్బింగ్ చెప్పిస్తారు. వాటన్నింటినీ ఓ అప్లికేషన్ లో లోడ్ చేస్తారు. థియేటర్ కు వెళ్లిన వారు ఫోన్ అప్లికేషన్ లోకి వెళ్లి కావాల్సిన లాంగ్వేజ్ ఎంచుకుని, హెడ్ ఫోన్స్ తగిలించుకోవడమే. స్క్రీన్ మీద ఏ భాషలో సినిమా వచ్చినా, చెవుల్లో మాత్రం మనకు కావాల్సిన భాషలో సంభాషణలు వినిపిస్తాయి. ఈ అప్లికేషన్ ఇంకా అభివృద్ధి దశలో వుంది. ఢిల్లీకి చెందిన ఓ సంస్థ దీని మీద వర్క్ చేస్తోంది.
ఇది పూర్తయితే, తమిళ సినిమాలు హైదరాబాద్ లో ఆడుతూ వుంటే తెలుగువాళ్లు చూడొచ్చు. తెలుగు సినిమాలు బెంగుళూరులో ఆడుతుంటే కన్నడ జనాలు చూడొచ్చు. తద్వారా సినిమా మార్కెట్ పెరుగుతుంది. ఈ లోగా మరో సంస్థ ముందుకు వచ్చి, ప్రపంచ భాషల్లోకి చాలా సులువుగా తెలుగు సినిమాలను అనువదించే పనికి శ్రీకారం చుట్టింది. ఏ చార్జీ తీసుకోకుండా అనువదించి, ఆ భాషల్లో విడుదలైతే వచ్చే లాభంలో వాటా తీసుకునేలా ఈ సంస్థ ముందుకు వచ్చింది.
ఈ విధంగా తెలుగు సినిమా స్పైడర్ అరబిక్ భాషలో విడుదల కాబోతోంది. అలాగే మలేషియా కోసం ఓ టీజర్ ను రెడీ చేసి విడుదల చేసారు. పెద్దగా అదనపు ఖర్చు వుండదు. వస్తే కొటి నుంచి అయిదు కోట్లు వచ్చే అవకాశం వుంటుంది. ఎందుకు వదులుకోవడం. టెక్నాలజీని వాడుకుని నిర్మాత నాలుగు డబ్బులు చేసుకోవడం మంచిందే. కానీ అదిగో మీకు అలా కూడా డబ్బులు వస్తున్నాయి కదా, మరో కోటి, రెండు కోట్లు రెమ్యూనిరేషన్ పెంచేయండి అంటూ హీరోలు పట్టుకుపోతే మాత్రం వేస్ట్.
నిజానికి ఇప్పుడు జరుగుతున్నది అదే. ఎంతలా మార్కెట్ విస్తరిస్తుంటే, హీరోలు తమ రెమ్యూనిరేషన్ అంతలా పెంచుకుంటూ పోతున్నారు. టాప్ హీరోల రెమ్యూనిరేషన్ ఇప్పుడు 20 నుంచి 30కోట్లకు చేరుకుంది. ఇంక నిర్మాతలు ఏం బాగుపడతారు? ఎంత టెక్నాలజీ వచ్చినా?