బాలయ్య 103వ సినిమా కూడా పూరి జగన్నాధ్ డైరక్టర్ అన్న టాక్ బలంగా వినిపించడం ప్రారంభమైంది. పూరికి నిజంగా బాలయ్య మరో చాన్స్ ఇస్తారా? అన్న విషయం పక్కన పెడితే, అసలు బాలయ్యతో సినిమా చేయాలన్న ఆసక్తితో వున్న డైరక్టర్లు ఎవరెవరు అన్నది లెక్క తీయాల్సి వుంది. బోయపాటి శ్రీనివాస్ సినిమా ఒకటి వుంది. అది ఎలాగూ వుంటుంది. కానీ ఇప్పటికిప్పుడు బోయపాటి ఓ సినిమాను మెగా హీరో రామ్ చరణ్ తో చేయాలని చూస్తున్నారు. ఆ తరువాత చిరంజీవితో కూడా చేయాలని ఆయనకు వుంది.
ఇక బోయపాటిని, పూరిని పక్కన పెడితే బాలయ్యతో సినిమా చేయాలని ముందుకు ఉరికే డైరక్టర్లు ఎవరూ అయితే ఇప్పటికి మాత్రం ఒక్కపేరు కూడా బయటకురాలేదు. బోలెడు మంది హీరోలతో బోలెడు మంది డైరక్టర్ల పేర్లు ముడిపెడుతూ వినిపిస్తూ వుంటాయి కానీ, బాలయ్యతో ఒక్కపేరు కూడా వినిపించడంలేదు. అదే చిత్రంగా వుంది. నిజానికి బాలయ్యకు డైరక్టర్ల పట్టింపులేదు. సత్యదేవ్, మహదేవ్ లాంటి వాళ్లకు చాన్స్ లు ఇచ్చారు. స్క్రిప్ట్ తో ఎవరైనా రావాలి. నిర్మాతలు దొరకాలి అంతే.
బహుశా లైన్ లో డైరక్టర్లు ఎవరూ లేరనే కావచ్చు, బాలయ్య పాత దర్శకుడు బి.గోపాల్ కు కబురు చేసారని వార్తలు బయటకు వచ్చాయి. చేసినా చేసి వుండొచ్చు. బాలయ్య తాను ఏదనుకుంటే అది చేస్తారు. ఎవరు ఏమనుకుంటారన్నది, ట్రాక్ రికార్డు అన్నది ఆయన పట్టించుకోరు. అందువల్ల మళ్లీ మరో చాన్స్ పూరికి ఇచ్చినా ఆశ్చర్యంలేదు.
కానీ ఎటొచ్చీ ఒకటే సమస్య. డైరక్టర్లు అంటే పిలిస్తే ఎవరో ఒకరు వస్తారు. బాలయ్యకు స్క్రిప్ట్ పట్టింపులు వుండవు. కానీ ముఫై నుంచి నలభై కోట్లు పెట్టే నిర్మాతలే కావాలి.