మీ-టూ.. అర్జున్, శృతి మధ్యలో అంబరీష్

సీనియర్ హీరో అర్జున్ పై శృతి హరిహరన్ చేసిన కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు శాండిల్ వుడ్ లో రావణ కాష్టంలా రగులుతూనే ఉంది. ఎవరూ ఊహించని విధంగా ఈ వివాదంపై కన్నడ సినీపరిశ్రమ రెండుగా…

సీనియర్ హీరో అర్జున్ పై శృతి హరిహరన్ చేసిన కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు శాండిల్ వుడ్ లో రావణ కాష్టంలా రగులుతూనే ఉంది. ఎవరూ ఊహించని విధంగా ఈ వివాదంపై కన్నడ సినీపరిశ్రమ రెండుగా చీలిపోయింది. శృతిని సమర్థించే వాళ్లు ఎంతమంది ఉన్నారో, అర్జున్ కు మద్దతిచ్చేవాళ్లు అంతకంటే ఎక్కువ మంది ఉండడం విశేషం.

వీళ్లిద్దరి ఆరోపణలు, అప్పట్లో ఏం జరిగిందనే విషయాన్ని పక్కనపెడితే.. ముందు ఇండస్ట్రీ చీలిపోకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించింది కర్ణాటక ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్. ఇందులో భాగంగా శాండిల్ వుడ్ పెద్దమనిషి అంబరీష్ ను రంగంలోకి దించింది.

మొదట అంబరీష్ మధ్యవర్తిగా అర్జున్-శృతితో ఓ మీటింగ్ పెట్టాలని ఛాంబర్ నిర్ణయించింది. కానీ ఈ సమావేశానికి శృతి నిరాకరించింది. అర్జున్ ముఖం చూడ్డానికి కూడా తనకు ఇష్టంలేదని తెగేసి చెప్పేసింది. దీంతో ఇరువురితో విడివిడిగానే సమావేశమవ్వాలని అంబరీష్ నిర్ణయించారు. అవసరమైతే తన ఫోన్ ద్వారా ఇద్దరితో మాట్లాడించాలని ఆయన నిర్ణయించుకున్నారు.

కర్ణాటక ఫిలింఛాంబర్ చొరవతో అంబరీష్ రంగంలోకి దిగడంలో అర్జున్-శృతి మధ్య రాజీకుదిరే అవకాశాలున్నాయని చాలామంది భావిస్తున్నారు. ఈ విషయంలో మొదట్నుంచి అర్జున్ రాజీ వైపు మొగ్గుచూపుతున్నాడు. శృతి సహకరిస్తే తనతో మాట్లాడతానని కూడా ఫిలింఛాంబర్ కు స్పష్టంచేశాడు.

కానీ శృతి వైపు నుంచి సానుకూలంగా స్పందన రాకపోవడంతో అర్జున్ కూడా లీగల్ గా ప్రొసీడ్ అయ్యాడు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా శృతి కామెంట్స్ చేసిందని ఆరోపిస్తూ.. బెంగళూరు సిటీ సివిల్ కోర్టులో 5 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేశాడు. అర్జున్ తరఫున అతడి బంధువు ధృవ సర్జా ఈ కేసు ఫైల్ చేశాడు.

అంతకంటే ముందు తనకు చెందిన సోషల్ మీడియా ఎకౌంట్లతో పాటు ఈ-మెయిల్ ఖాతా కూడా హ్యాక్ అయిందంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు అర్జున్. తాజా ఫిర్యాదులతో ఈ వివాదం మరింత వేడెక్కింది. ఇలాంటి పరిస్థితుల్లో రంగంలోకి దిగిన అంబరీష్, ఇద్దరి మధ్య రాజీ కుదర్చగలరా అనేది ఆసక్తికరంగా మారింది.

గ్రేట్ ఆంధ్ర వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి