పెళ్లయిన తర్వాత నుంచి హీరోయిన్ సమంత చాలా ఆచి తూచి పాత్రలు ఎన్నుకుంటోంది. యుటర్న్ లాంటి వైవిధ్యమైన సినిమాలు టేకప్ చేస్తోంది. త్వరలో ఇలాగే మరో సినిమా కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది. చిరకాలంగా చేతిలో సినిమాలు లేక, ఖాళీగా కూర్చున్న నందినీ రెడ్డి ఓ కొరియన్ ఫిల్మ్ ఆధారంగా మాంచి కథ తయారుచేసారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
ఈ కథకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇప్పటికే బయటకు వచ్చింది. ఈ సినిమాలో సమంతది వైవిధ్యమైన పాత్ర అని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇంకా తెలియడంలేదు కానీ, ఇండస్ట్రీలో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం ఈ సినిమాలో సమంత పాత్ర భిన్నమైన షేడ్స్ వుంటుందని తెలుస్తోంది.
పైగా ఫేస్, మనిషి మాత్రం యంగ్ గా, అందంగా వుంటుందని, కానీ వయసు, మనసు మాత్రం ఓల్డ్ ఏజ్ ఫీల్ తో వుంటాయని టాక్ వినిపిస్తోంది. ఆమె మనసు తెలియక, కేవలం అందం చూసి అబ్బాయిులు వెంటబడడం లాంటి వ్యవహారం వుంటుందట.
ఈ సినిమాలో ఓ మేల్ క్యారెక్టర్ కు హీరో నాగశౌర్యను తీసుకున్నారు. సుమారు 20 రోజులు షూటింగ్ వుండే పాత్ర అని తెలుస్తోంది. కళ్యాణ వైభోగమే సినిమా దగ్గర నుంచి నందినీ రెడ్డికి నాగశౌర్య కుటుంబ సభ్యులందరితో మంచి అనుబంధం వుంది. అందుకే ఈ పాత్రకు ఆమె నాగశౌర్యను ఎంచుకున్నారు.
ఇంకా ఇలాంటి మేల్ క్యారెక్టర్లు మరో ఒకటి రెండు వుంటాయని తెలుస్తోంది. మరిన్ని వివరాల కోసం వెయిట్ చేయాల్సిందే.