ఈ రోజుల్లో ఒకరి ఫోన్ ను మరొకరు లాక్ ఓపెన్ చేసిన స్థితిలో తీసుకున్నారంటే.. వారి జట్టు మొత్తం వీరి చేతిలో చిక్కుకున్నట్టే! సామాన్యుడి నుంచి అసమాన్యుడి వరకూ ఇదే పరిస్థితే ఉండవచ్చు. చాలా వ్యక్తిగతమైన విషయాలన్నీ ఇప్పుడు ఫోన్ తోనే ముడిపడి ఉంటాయి. దీనికి సెలబ్రిటీలు కూడా మినహాయింపు కాకపోవచ్చు.
బాలీవుడ్ నటుడు షారూక్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఫోన్ ఎన్సీబీ స్వాధీనం చేసుకోవడం కూడా అతడిని మరింత ఇరకాటంలో పడేస్తున్నట్టుగా ఉంది. వాస్తవానికి క్రూజ్ షిప్ లో ఆర్యన్ ఖాన్ వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరకలేదు. అతడి స్నేహితుల వద్ద డ్రగ్స్ ఉన్నాయి. వాటిని ఆర్యన్ వాడాడు, వాడుతుంటాడు అనేది ఎన్సీబీ అభియోగం. ఆ అభియోగానికి ప్రధానమైన ఆధారాలు ప్రత్యక్షంగా దొరికింది లేదు! అతడి ఫోన్ ను స్వాధీనం చేసుకోవడం ద్వారా ఎన్సీబీ ఈ వాదన వినిపిస్తూ ఉంది!
ఆర్యన్ ఖాన్ ఫోన్ లో డ్రగ్స్ గురించి చాట్ చేశాడని, దీన్ని బట్టి అతడికి డ్రగ్స్ అలవాటు ఉందని, అలాగే డ్రగ్స్ సరఫరా దారులతో ఆర్యన్ ఖాన్ తరచూ చాట్ చేశాడని ఎన్సీబీ వాదిస్తోంది. దీని గుట్టు అంతా బయటకు తీసే వరకూ ఆర్యన్ కు బెయిల్ ఇవ్వరాదని అంటోంది. ఈ క్రమంలో ఈ రోజు మళ్లీ ఆర్యన్ బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో ఆర్యన్ ఖాన్ పై ఎన్సీబీ మరో అస్త్రం సంధించిందని సమాచారం. ఈ అస్త్రం మరేదో కాదు.. అతడి వాట్సాప్ చాటింగే!
ఈ సారి బెయిల్ కు అభ్యంతరం చెప్పడానికి వాట్సాప్ చాట్ నే డైరెక్టుగా కోర్టుకు సబ్మిట్ చేస్తోందట ఎన్సీబీ. ఇందులో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ గురించి మాట్లాడటం ఉందట. అదంతా కోడ్ వర్డ్స్ లోనే ఇది వరకే వార్తలు వచ్చాయి. అయితే ఆ కోడ్ వర్డ్స్ కు ఎన్సీబీ చెప్పే భాష్యం సరికాదని.. ఆర్యన్ లాయర్లు అంటున్నారు.
అలాగే ఆర్యన్ ఖాన్ ఒక బాలీవుడ్ వర్తమాన నటితో డ్రగ్స్ గురించి వాట్సాప్ లో చాట్ చేశాడని ఎన్సీబీ కోర్టుకు వివరిస్తోందట. అందుకు సంబంధించి వారి వాట్సాప్ చాట్ సారాంశాన్ని కోర్టు ముందు ఉంచి, ఈ సారి బెయిల్ కు నో చెప్పించాలని ఎన్సీబీ గట్టిగా వాదించనుందని తెలుస్తోంది. మరి అదే జరిగితే.. సదరు నటీమణిని కూడా ఎన్సీబీ తన కస్టడీలోకి తీసుకోవడం నెక్ట్స్ ఎపిసోడ్లో ఉంటుందేమో!