అసలు అఖిల్ సమస్య ఏమిటి?

అక్కినేని అఖిల్. ఒకటో సినిమా ముందు ఎంత ఆలోచించాడో, రెండో సినిమాకు అంతకన్నా ఎక్కువగా ఆలోచిస్తున్నాడు. సాధారణంగా కాస్త బ్యాకప్, సపోర్టు, ప్రేక్షకులు చూస్తారులే అన్న భరోసా వున్న హీరోకు ప్రాజెక్టుల సమస్య వుండకూడదు.…

అక్కినేని అఖిల్. ఒకటో సినిమా ముందు ఎంత ఆలోచించాడో, రెండో సినిమాకు అంతకన్నా ఎక్కువగా ఆలోచిస్తున్నాడు. సాధారణంగా కాస్త బ్యాకప్, సపోర్టు, ప్రేక్షకులు చూస్తారులే అన్న భరోసా వున్న హీరోకు ప్రాజెక్టుల సమస్య వుండకూడదు. కానీ అఖిల్ ది చిత్రమైన సమస్య. తొలి సినిమా ఆకాశమంత రేంజ్ లో వుంటుందన్న హైప్ వచ్చింది. అంతకు అంతా డిజాస్టర్ అయింది. ఇదే ఇప్పుడు సమస్యగా మారింది.

రెండో సినిమా అంటూ చేస్తే, అది కచ్చితంగా హిట్ అయి తీరాలి. ఈ బాధ్యత ఇటు అఖిల్ కన్నా ఎక్కువగా దర్శకులపైనే వుంటుంది. అందుకే చాలా మంది దర్శకులు వెనుకంజ వేస్తున్నారని వినికిడి. హిట్ అయి తీరాలి అనే ప్రెజర్ తో సినిమా తీయడం దాన్ని తట్టకోవడం చిన్న విషయం కాదని చాలా మంది దర్శకుల భావన.

ఇక రెండో విషయం అఖిల్ ఆటిట్యూడ్ పై నిజాలో, అబద్ధాలో కానీ ఇండస్ట్రీలో గ్యాసిప్ లు బాగా పాకి పోయాయి. దానికి తోడు ఒక్కో దర్శకుడి పేరు వినిపించడం, అట్టే క్యాన్సిల్ కావడం అన్నది ఈ గ్యాసిప్ లకు మరింత బలం చేకూరుస్తున్నాయి. కళ్యాణ్ కృష్ణ, వంశీ పైడిపల్లి, హను రాఘవపూడి ఇలా ఇప్పటికి ముగ్గురు తప్పుకున్నారు. ఇప్పుడు నాలుగో పేరు గా విక్రమ్ కుమార్ బరిలోకి వచ్చారు. 

ఇటీవలే విక్రమ్ కుమార్ వచ్చి కథ లైన్ చెప్పి ఒకె చేయించుకువెళ్లారు. ప్రస్తుతం తన పెళ్లి హడావుడిలో వున్నారు విక్రమ్ కుమార్. అది పూర్తి చేసుకుని నవంబర్ లో వస్తారు. అది పూర్తయ్యాక పనిలో దిగుతారు. సాధారణంగా స్క్రిప్ట్ కోసం విక్రమ్ కుమార్ చాలా టైమ్ తీసుకుంటారు. అందువల్ల వచ్చే సమ్మర్ కు కానీ విక్రమ్ కుమార్ స్క్రిప్ట్ తయారు కాకపోవచ్చు. మరి అంతవరకు వెయిట్ చేస్తే, అఖిల్ సినిమా 2017 ఆఖరుకు కానీ రెడీ కావచ్చు.

మరి అంతవరకు అఖిల్ వెయిట్ చేస్తాడా? లేక సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లోనే మారుతి డైరక్షన్ లో సినిమా చేస్తాడా అన్నది ఇప్పుడు లేటెస్ట్ పాయింట్. అఖిల్ తో సినిమా చేయడానికి యువి క్రియేషన్స్ రెడీ గానే వుంది. కానీ మారుతి ఆలోచన ఏమిటన్నది ఇంకా తెలియడం లేదు. మొత్తానికి 2017లో అఖిల్ సినిమా జనం ముందుకు రావాలంటే మారుతి లేదా మరింత ఫాస్ట్ గా చేసే డైరక్టర్ ఎవరినైనా చూసుకోవడం అవసరం.