నిర్మాతలందరికీ ఇప్పుడు శాటిలైట్ రైట్స్ అనేది బంగారు బాతుగుడ్డులా మారింది. కాస్త క్రేజీ ప్రాజెక్టు సెట్ అయితే చాలు, టోటల్ బడ్జెట్ ను శాటిలైట్ హక్కుల రూపంలో లాగించేద్దామని చూస్తున్నారు. ఎన్నో సినిమాల విషయంలో ఇలా జరిగింది. ఇప్పుడు దేవదాస్ విషయంలో కూడా నిర్మాత అశ్వనీదత్ ఇదే ప్లాన్ లో ఉన్నాడు.
పేరుకు ఇది మల్టీస్టారర్ అయినప్పటికీ డెడ్ చీప్ సినిమా. ఇంత తక్కువ ఖర్చుతో ఓ మల్సీస్టారర్ మూవీని ఎవరూ తీయలేరేమో. నాని రెమ్యూనరేషన్ పెరిగినప్పటికీ.. ఎవడే సుబ్రమణ్యం సినిమా టైమ్ లో చేసుకున్న ఒప్పందం, అశ్వనీదత్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా చాలా తక్కువ పారితోషికానికి ఈ హీరో సినిమా చేస్తున్నాడు. అటు నాగార్జునకైతే పట్టుమని 3 కోట్ల రూపాయలు కూడా ఇవ్వలేదని టాక్.
మొత్తమ్మీద అటుఇటుగా 10 కోట్ల రూపాయల బడ్జెట్ తో దేవదాస్ సినిమాను పూర్తిచేస్తున్నారు. ఇప్పుడీ సినిమాకు కేవలం శాటిలైట్ రైట్స్ కే 15 కోట్ల రూపాయలు చెబుతున్నాడు అశ్వనీదత్. డీల్ సెట్ అయితే.. నిర్మాణ ఖర్చు వెనక్కి రావడంతో పాటు, అదనంగా మరో 5 కోట్లు లాభం అన్నమాట.
నాగార్జున, నాని ఇద్దరికీ బుల్లితెరపై మంచి క్రేజ్ ఉన్నమాట వాస్తవమే. పైగా ఇది మల్టీస్టారర్. కచ్చితంగా స్మాల్ స్క్రీన్ కు వర్కవుట్ అవుతుంది. కానీ 15 కోట్ల రూపాయలు పెట్టి ఈ సినిమాను ఏ ఛానెల్ తీసుకుంటుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.