'సైరా'లాంటి భారీ చిత్రాన్ని నిర్మిస్తోన్న చరణ్ ఇలాంటి చిత్రాలకి దర్శకుడికి ఎంత స్వేచ్ఛ వుండాలనేది ముందే గ్రహించాడు. అందుకే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తోన్న సురేందర్‌పై నమ్మకం వుంచి అతనికి ఎలాంటి డెడ్‌లైన్స్ పెట్టడం లేదు. అలాగే బడ్జెట్ పరంగా లిమిట్ కూడా పెట్టలేదు.
వృధా ఖర్చు లేకుండా చూసుకుంటూ, ఏ సీన్‌కి ఎంత అవసరమో అంత ఖర్చు పెడుతూ రెండు వందల కోట్లు పైగా ఖర్చయినా ఫర్వాలేదని సురేందర్‌కి భరోసా ఇచ్చాడు. అంతటితో ఆగకుండా ఈ చిత్రాన్ని ఫలానా టైమ్‌కి పూర్తి చేయాలంటూ ఎలాంటి కండిషన్లు పెట్టడంలేదు.
మగధీర చిత్రంలో నటించిన అనుభవం వుండడంతో ఈ తరహా చిత్రాలకి ఎంత సమయం అవసరమవుతుందో చరణ్‌కి తెలుసు. ఏమాత్రం తొందరపెట్టినా అవుట్‌పుట్‌పై ప్రభావం పడుతుందని తెలుసు కనుక సురేందర్‌పై ఒత్తిడి పెట్టడం లేదు.
ప్రస్తుతానికి వచ్చే వేసవికి విడుదల చేయాలని భావిస్తున్నా కానీ మరో రెండు, మూడు నెలలు ఆలస్యమైనా ఫర్వాలేదని, సైరా లాంటి చిత్రాలకి సీజన్‌తో పని లేదని, ఎప్పుడు వచ్చినా ఆదరణ వుంటుందని చెబుతూ దర్శకుడిపై అదనపు ఒత్తిడి లేకుండా చూసుకుంటున్నాడు.