ఒక మరణం.. ఒక కలయిక

ఒక జననం ఒక కలయిక అన్నది వాస్తవం. ఎందుకంటే ఒక జననంతో ఓ సభ్యుడు ఓ ఇంట్లో, ఓ సమూహంలో, ఓ సమాజంలో కలుస్తాడు. కానీ ఓ మరణం మాత్రం కలయిక కాలేదు. కానీ…

ఒక జననం ఒక కలయిక అన్నది వాస్తవం. ఎందుకంటే ఒక జననంతో ఓ సభ్యుడు ఓ ఇంట్లో, ఓ సమూహంలో, ఓ సమాజంలో కలుస్తాడు. కానీ ఓ మరణం మాత్రం కలయిక కాలేదు. కానీ నందమూరి కుటుంబంలో ఓ మరణం, ఓ కలయికగా మారుతోంది. కాదు, కాదు, మారిపోయినట్లే. ఇదంతా నిన్నటి వరకు ఉప్పు, నిప్పులా వున్న నందమూరి వారసుల వ్యవహారమే.

నందమూరి హరికృష్ణ కుటుంబానికి, నందమూరి బాలకృష్ణ కుటుంబానికి మధ్య అంత సయోధ్య లేదని చిరకాలంగా వార్తలు వినిపిస్తూనే వున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ను తెలుగుదేశం పార్టీకి దూరంగా వుంచాలని ప్రయత్నాలు జరిగినట్లు వార్తలు వినిపించాయి. ఎన్టీఆర్ ను అవమానపరిచే విధంగా చాలా వ్యవహారాలు జరిగాయి.

గత ఎన్నికల ముందు ఎన్టీఆర్ జగన్ వైపు మొగ్గాడని, అందుకే పార్టీ అతన్ని దూరం పెట్టిందని వదంతులు పుట్టించారు. అలాగే బాలయ్యతో ఎందుకో కలయిక ఆగిపోయింది. ఒక్క కళ్యాణ్ రామ్ మాత్రమే కాస్త ఇటు ఎన్టీఆర్ కు అటు బాలయ్యకు మధ్యలో వారథిలా వుంటూ వచ్చారు. ఎన్టీఆర్ కూడా ఇంటర్వూలు ఇచ్చేముందు, బాబాయ్ సంగతులు, రాజకీయాలు అడగవద్దని షరతుపెట్టిన సందర్భాలు వున్నాయి.

ఇలాంటి నేపథ్యంలో హరికృష్ణ మరణించిన వెంటనే సినేరియా అంతా మారిపోయింది. గత మూడు రోజులుగా బాలయ్య బాబు పూర్తిగా ఎన్టీఆర్ తో కలిసే వున్నారు. ఎన్టీఆర్-బాలయ్య ముచ్చటించుకుంటున్న వీడియో బయటకు వచ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్ కు రాజకీయాల మీద పూర్తిగా ఆసక్తి పోయినట్లు ఆయన సన్నిహిత వర్గాల బోగట్టా.

హీరోయిజం ఒక్కటే రాజకీయాలకు సరిపోదని ఆయన, చిరంజీవి, పవన్ కళ్యాణ్ వైనం చూసి అర్థం చేసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే మరో పదేళ్ల వరకు అస్సలు రాజకీయల ఊసేపట్టనని, తనకు తన సినిమాలే కీలకమని ఎన్టీఆర్ అంటున్నట్లు తెలుస్తోంది.

అదే నిజమైతే ఎన్టీఆర్ ను అక్కున చేర్చుకోవడానికి చంద్రబాబు, బాలయ్య, లోకేష్ రెడీ. వాస్తవానికి ఎన్టీఆర్ ను దగ్గరకు తీయాలని చంద్రబాబుకు వున్నా బాలయ్య కారణంగా మౌనంగా వున్నారని కూడా గుసగుసలు వున్నాయి. ఇప్పుడు ఇక లైన్ అంతా క్లియర్ అయిపోయింది.

చంద్రబాబుకు హరికృష్ణతో సమస్య. అందుకోసమే బాలయ్యను లైన్లో పెట్టారు. ఇప్పుడు హరికృష్ణ లేరు. ఇక ఎన్టీఆర్ కు కూడా అనవసరపు పోరాటాలు ఎందుకన్న భావనరావచ్చు. అందువల్ల ఇక రాజకీయంగా నందమూరి ఫ్యామిలీ అంతా ఒకటే అయిపోయినట్లే అనుకోవాలి.

వాస్తవానికి గతంలో కూడా బాలయ్యకు, ఎన్టీఆర్ కు మధ్య ఎలా వున్నా, ఫ్యాన్స్ మాత్రం అరమరికలు లేకుండా ఇద్దరినీ అభిమానించేవారు. ఎవరో కొద్దిమంది మాత్రమే వేరు వేరుగా చూసేవారు. అందువల్ల ఇకపై నందమూరి అభిమానులు ఒకటే. నందమూరి ఫ్యామిలీ రాజకీయాలు ఒకటే.

ఇంతకీ ఈ శుభతరుణంగా తాత ఎన్టీఆర్ బయోపిక్ లో యంగ్ ఎన్టీఆర్ గా, జూనియర్ కు బాలయ్య చాన్స్ ఇస్తాడా? ఏమో? గుర్రం ఎగరావచ్చు?