వర్క్ కల్చర్, తండ్రి నేర్పిన మంచి విషయాలు, తాత పాటించిన మంచి నియమాలు కారణంగా నందమూరి సోదరులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సోమవారం నుంచే షూటింగ్ లకు వెళ్తున్నారు. ఇది ఓ గొప్ప విషయం. ఇదీ, మీడియాకు ఎన్టీఆర్ క్యాంప్ నుంచి అందిన ఫీలర్లు.
తండ్రి పోయిన అయిదో రోజునే డ్యూటీకి వెళ్లడం అన్నది గొప్ప విషయం. హీరోలకు మాత్రమే. కానీ సగటు మధ్య తరగతి జనాలకు అయితేకాదు. నిజానికి తండ్రి మరణించిన తరువాత పెద్ద కర్మ దాకా నిర్వికారంగా, నిర్మోహనంగా వుండడం అన్నది పద్దతి. తండ్రి మరణం, సంతాపం, కర్మకాండలు, వాటి తరువాతే మరేమైనా. జనం ఇలా అనుకుంటారనే, ముందుగానే ఫీలర్లు అన్నమాట. తండ్రి నేర్పిన మంచి పద్దతులు, తాత నేర్పిన ఆశయాలు అంటూ చిన్న కలరింగ్ ఇచ్చే ప్రయత్నం.
మరి అదే నిజమైతే, గతంలో నిర్మాతలు డబ్బులు సకాలానికి ఇవ్వలేదని డబ్బింగ్ ఆపేసిన రోజులు లేవా? అప్పుడు ఇవి గుర్తులేవా? నిజానికి ఇద్దరు బ్రదర్స్ సినిమా షూటింగ్ లకు వెళ్లక తప్పని పరిస్థితి. ఎందుకంటే అరవింద సమేత వీరరాఘవ దసరాకు విడుదల కావాలి. ఒక్క నిమిషం కూడా వర్క్ ఆగకుండా చేస్తేనే అది సాధ్యం అవుతుంది.
అప్పటికీ కాస్త టెన్షనే. అలాంటిది. అయిదు రోజులు పాటు హీరో షూటింగ్ కు రాకపోతే, సినిమా రిలీజ్ రిస్క్ లో పడుతుంది. అందుకే ఎన్టీఆర్ షూటింగ్ కు వెళ్లక తప్పదు. ఇక కళ్యాణ్ రామ్. ఆయన వచ్చే నెల నుంచి ఎన్టీఆర్ బయోపిక్ మీదకు వెళ్తున్నారు. దాదాపు 26 రోజులు షూటింగ్. ఈ లోగా ప్రస్తుతం చేస్తున్న గుహన్ డైరక్షన్ సినిమా పూర్తి చేయాలి. లేదంటే ఆ సినిమా మళ్లీ ఇప్పట్లో పూర్తికాదు.
అందుకే ఆయన కూడా షూటింగ్ కు వెళ్లాలి. అలా సింపుల్ గా చెప్పేస్తే ఎలా? డ్యూటీ ఈజ్ ఫస్ట్ అన్నట్లు ఫీలర్లు. ఏంచేస్తాం. అంతా సినిమాయే ప్రపంచం.