తండ్రి లేడు. అకస్మాత్తుగా వదలి వెళ్లిపోయాడు. హీరో కళ్యాణ్ రామ్ ఇలాంటి నేపథ్యంలో తానే తండ్రిగా మారిపోతున్నాడు. తండ్రి పాత్రలోకి దిగిపోబోతున్నాడు. మరో వారంరోజుల్లో హరికృష్ణ పాత్రలోకి కళ్యాణ్ రామ్ మారుతున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ కోసం హరికృష్ణ పాత్రను కళ్యాణ్ రామ్ పోషిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ పాత్ర షూట్ సెప్టెంబర్ మొదటివారంలో ప్రారంభమవుతుంది. కంటిన్యూగా 26 రోజుల పాటు షూటింగ్ జరుపుతారు. కుటుంబపరమైన సన్నివేశాలు అన్నీ స్థానికంగా చిత్రీకరిస్తారు. చైతన్యరథం డ్రయివింగ్ సీన్లు మాత్రం తెలంగాణ ప్రాంతంలోని కొన్ని పల్లె ప్రాంతాల్లో చిత్రీకరించే అవకాశం వుంది.
హరికృష్ణగా గెటప్ వేసుకోవడం కోసం కళ్యాణ్ రామ్ పూర్తిగా తన గడ్డం, మీసాలు తీసి, పక్కాగా తండ్రిలా కనిపించడానికి వీలైన మీసం, ఇతర మేకప్ ను ఇప్పటికే ఓసారి టెస్ట్ మేకప్ చేసినట్లు తెలుస్తోంది. నిజంగా తండ్రి పోయిన తరువాత 26 రోజుల పాటు అదే తండ్రి పాత్రలో జీవించేలా నటించే పరిస్థితి రావడం కళ్యాణ్ రామ్ కు ఓ గొప్ప అనుభూతిగా మిగిలిపోతుంది.