వరుసగా సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో, అభిషేక్ బచ్చన్ ను మళ్లీ తమ సినిమాల్లోకి తీసుకునేందుకు మేకర్స్ ఎవ్వరూ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. స్వయానా బిగ్ బి అమితాబ్ కొడుకు అయినప్పటికీ, అభిషేక్ ను ఎవరూ పట్టించుకోలేదు. అలా కెరీర్ లో రెండేళ్లు గ్యాప్ తెచ్చుకున్న అభిషేక్, తాజాగా తన భార్య ఐశ్వర్యరాయ్ చలవతో బ్యాక్ టు బ్యాక్ 2 సినిమా ఆఫర్లు దక్కించుకున్నాడు. ఈ మొత్తం వ్యవహారంపై ఐష్ రియాక్ట్ అయింది. తన భర్త కావాలనే గ్యాప్ తీసుకున్నాడంటూ అభిషేక్ ను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేసింది.
“అభిషేక్ తీసుకున్న నిర్ణయం సరైనదే. ఎందుకంటే ఏ ప్రొఫెషనల్ అయినా ఇలా గ్యాప్ తీసుకుంటే మంచిది. కాస్త రిలాక్స్ అయి ఏం చేస్తే బాగుంటుందనే నిర్ణయాన్ని అభిషేక్ తీసుకున్నాడు. ఇప్పటివరకు చేసిందేంటి, ఇకపై ఏం చేయాలనేది ఆలోచించాలంటే కాస్త గ్యాప్ తీసుకోవాల్సిందే కదా.”
మరోవైపు ఇండస్ట్రీలో తన భర్తకు తనే దగ్గరుండి అవకాశాలు ఇప్పిస్తోందనే పుకారును కూడా ఐష్ కొట్టిపారేసింది. అనుకోకుండా అలా జరిగిందని, తన భర్తకు తను రిఫరెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదంటోంది ఐష్.
“మన్ మారిజాన్ అనే ప్రాజెక్టులో నటించడానికి మొదట అభిషేక్ అంగీకరించాడు. ఆ తర్వాత అనుకోకుండా అందులో నేను చేరాను. అనురాగ్ బసు డైరక్ట్ చేయబోయే గులాబ్ జామూన్ సినిమాను ఫస్ట్ నేను అంగీకరించాను. తర్వాత అనుకోకుండా అభిషేక్ వచ్చిచేరాడు. ఈ రెండు ప్రాజెక్టులు అలా అనుకోకుండా సెట్ అయ్యాయి.”
8 ఏళ్ల గ్యాప్ తర్వాత తన భర్తతో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉందంటోంది ఐశ్వర్యరాయ్. అయితే బాలీవుడ్ మీడియా మాత్రం ఈ వ్యవహారంపై కామెంట్స్ చేస్తూనే ఉంది. అవకాశాల్లేక ఇంట్లో కూర్చున్న అభిషేక్ కు, ఐశ్వర్యరాయ్ ఉపాధిహామీ పథకం కింద పని కల్పించిందని జోకులు వేస్తున్నాయి.