cloudfront

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: పేపర్‌ బాయ్‌

సినిమా రివ్యూ: పేపర్‌ బాయ్‌

రివ్యూ: పేపర్‌ బాయ్‌
రేటింగ్‌: 2.5/5
బ్యానర్‌: సంపత్‌ నంది టీమ్‌ వర్క్స్‌, ప్రచిత్ర క్రియేషన్స్‌, బిఎల్‌ఎన్‌ సినిమా
తారాగణం: సంతోష్‌ శోభన్‌, రియా సుమన్‌, తాన్యా హోప్‌, అన్నపూర్ణ, బిత్తిరి సత్తి, విద్యుల్లేఖా రామన్‌ తదితరులు
సంగీతం: భీమ్స్‌
కూర్పు: తమ్మిరాజు
ఛాయాగ్రహణం: సౌందర్‌ రాజన్‌
నిర్మాతలు: సంపత్‌ నంది, రాములు, వెంకట్‌, నరసింహ
రచన: సంపత్‌ నంది
దర్శకత్వం: జయశంకర్‌
విడుదల తేదీ: ఆగస్ట్‌ 31, 2018

పేపర్‌ బాయ్‌ లవ్‌స్టోరీ అనగానే మైండ్‌లోకి వచ్చే మొట్టమొదటి థాట్‌... 'రిచ్‌ గాళ్‌తో లవ్‌లో పడతాడని. వారి ప్రేమకి పెద్దలు అడ్డు పడతారని!' ఈ కథని ఇంత రొటీన్‌గా అనిపించకుండా చేయడానికి సంపత్‌ నంది చాలా ట్రై చేసాడు. అయితే అతనెంతగా ప్రయత్నించినా కానీ 'అసలు కథ' ఇదేనని ఇట్టే అర్థమైపోతుంది. ఈ రెగ్యులర్‌ 'రోమియో జూలియట్‌' కథని కాస్త పొయెటిక్‌గా, ఇంకాస్త ఎమోషనల్‌గా, మరికాస్త క్లాస్‌గా చెప్పేందుకు చేసిన ప్రయత్నం బాగుంది. అయితే మరీ కళాత్మకంగా చెప్పేస్తే కమర్షియల్‌గా దెబ్బ తినాల్సి వస్తుందని భావించారో ఏమో మధ్యలో అవసరం లేని కామెడీని ఇరికించడం జరిగింది. ఆ కామెడీ కాస్తా మరీ ఊరగా వుందేమో... పాల మీద నూనెలా తేలిపోయింది.

పేపర్‌ బాయ్‌తో అల్ట్రా రిచ్‌ గాళ్‌ ప్రేమలో పడడం అనేది అక్కడక్కడా జరిగే విషయమే కావచ్చు కానీ అందరికీ ఆమోదయోగ్యమైన జంట కాదది. ఇదే భావన రచయితకీ కలిగినట్టుంది. అందుకే పేపర్‌ బాయ్‌ ఆల్రెడీ బీటెక్‌ చేసాడనే భరోసా ఇవ్వాల్సి వచ్చింది. ఇక్కడే మన వాళ్లకీ, తమిళ దర్శ రచయితలకీ మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తుంది. క్లాస్‌ డిఫరెన్స్‌ వున్న లవ్‌స్టోరీలు చూపించడంలో వారు షుగర్‌ కోటింగ్‌ జోలికి పోనే పోరు. వీధి చివర మెకానిక్‌ని ఒక ధనిక అమ్మాయి 'ప్రేమిస్తే' అతను మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదివి మెకానిక్‌ షాప్‌ పెట్టుకోడు. మరీ రియాలిటీకి అంత దగ్గరగా తీసే ఉద్దేశం లేదేమోనని దీనిని అంతగా పట్టించుకోకుండా, క్లాస్‌ ట్రీట్‌మెంట్‌కే అడ్జస్ట్‌ అవుదామంటే... డ్రామా ఎక్కువైందని భావించిన చోట బిత్తిరి సత్తిని దించి కామెడీతో కవర్‌ చేసుకుందామని చూసారు.

ఈ సినిమాతో వచ్చిన సమస్య ఏమిటంటే... రచయితకి ఏదైనా కవితాత్మకంగా చెప్పాలనే ఆలోచన వుంది. అదే సమయంలో ఇలా చెబితే ఎంతమందికి నచ్చుతుందోననే అనుమానం కూడా వుంది. అందుకే అటు మచ్చల్లేని తెల్లదనం లేక, ఇటు అచ్చమైన మాస్‌దనం రాక నడుమనెక్కడో చిక్కుకుని పేపర్‌ నలిగింది. పేపర్‌ బాయ్‌తో ఆ అమ్మాయ్‌ అంతగా ప్రేమలో పడిపోవడానికి తగిన కారణాలేమీ కనిపించవు. పుస్తకాలలో అండర్‌లైన్‌ చేసుకున్న భావాలు కలిసి ప్రేమించుకున్నట్టే చూపిస్తారు తప్ప అంతకుమించిన బలమైన సిట్యువేషన్స్‌ క్రియేట్‌ చేయలేదు.

మరీ డ్రమెటిక్‌గా మాట్లాడుకుంటోన్న ఈ జంటని చూస్తే అసలు వీళ్లు ఈ వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ కాలం నాటి వారేనా లేక... మూతపడిన పబ్లిక్‌ లైబ్రరీల కాలానికి చెందినవారా అనే అనుమానం వస్తుంది. అసలే కంటెంట్‌ లేక ముందుకి కదలక, ఆపై పొయెటిక్‌గా తీసే ప్రయత్నంలో ఇంకాస్త బడలిక చేరిన ఈ చిత్రంలో ప్రతి మాటని కొలిచి మాట్లాడే నాయికానాయకుల వల్ల ప్రతి సన్నివేశం ఒక ఘడియలా అనిపిస్తూ తదుపరి ఘట్టానికి వెళ్లేందుకు మొరాయిస్తుంది. కథానాయక పాత్రకి సంతోష్‌ శోభన్‌ని ఎంపిక చేసుకోవడం బాగుంది.

పేపర్‌ బాయ్‌ పాత్రకి అతను బాగా సూట్‌ అవడమే కాకుండా చక్కని నటనతో బాగా మెప్పించాడు. ఇతనెంత ఎక్స్‌ప్రెసివో హీరోయిన్‌ రియా సుమన్‌ అంత వీక్‌. ఆనాటి తొలిప్రేమలో కీర్తి రెడ్డిని తలపించేలా వున్న ప్రెజెంటేషన్‌తో కొన్ని ఫ్రేమ్స్‌లో బాగున్నా కానీ ఈ పాత్రకి అవసరమైన హావభావాలని, భావోద్వేగాలని పలికించలేకపోయింది. తాన్యా హోప్‌ ఈ జంటని కలిపే హోప్‌గా కాసేపు కనిపిస్తుంది. అన్నపూర్ణ తన సహజ నటనతో వినోదానికి దోహదపడగా, బిత్తిరి సత్తి మార్కు హాస్యాన్ని ఇష్టపడే వారికోసం ఒక సన్నివేశముంది. విద్యుల్లేఖా రామన్‌ని ప్రతి సినిమాలోను భోజన ప్రియురాలిగా చూపించి నవ్వించాలని చేస్తోన్న ప్రయత్నం రాను రాను వికటిస్తోంది.

చిన్న సినిమా అయినా కానీ సాంకేతికంగా ఈ చిత్రం ఉన్నత ప్రమాణాలు పాటించింది. ప్రతి ఫ్రేమ్‌ చాలా బాగుంది. సినిమాటోగ్రాఫర్‌ పనితనం అడుగడుగునా కనువిందనిపిస్తుంది. పాటల్ని అందమైన లొకేషన్లలో చిత్రీకరించిన విధానం చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తుంది. సంగీతం కూడా ఫర్వాలేదనిపిస్తుంది. రెండు పాటలు వినడానికి బాగున్నాయి. నేపథ్య సంగీతం చిత్రీకరణకి తగ్గ పొయెటిక్‌ ఫీల్‌తో మెప్పిస్తుంది. కథా రచయితగా కంటే సంభాషణల రచయితగా సంపత్‌ నంది ప్రతిభ ఆకట్టుకుంటుంది. చాలా సన్నివేశాల్లో మంచి సంభాషణలతో అతని కలం విజృంభించింది.

దర్శకుడు జయశంకర్‌ తనకిచ్చిన మెటీరియల్‌ని నీట్‌గా ప్రెజెంట్‌ చేసాడని చెప్పాలి. షాట్‌ మేకింగ్‌, ఫ్రేమ్స్‌ బ్యూటిఫుల్‌గా అనిపిస్తాయి. అయితే కథనంలో జరిగిన కల్తీ వల్ల అతను కూడా కాంప్రమైజ్‌ అయిపోయి అవసరం లేని నస జోడించాల్సి వచ్చింది. దర్శకుడిగా అతని ప్రతిభ హీరో తల్లిదండ్రులు హీరోయిన్‌ ఇంటికి వచ్చిన సందర్భంలో, అలాగే హీరోయిన్‌ అన్నయ్యలు హీరో ఇంటికి వచ్చిన సన్నివేశంలో బాగా తెలుస్తుంది. ఈ తరహా చిత్రాలని సమకాలీన ప్రేక్షకులు మెచ్చుకునే రీతిన ప్రెజెంట్‌ చేయాలనుకున్నపుడు వాస్తవానికి దగ్గరగా తెరకెక్కిస్తే బాగుంటుంది.

మరాఠీ చిత్రం 'సైరాట్‌' అంతటి ఘన విజయం సాధించి అవార్డులు అందుకున్నా, ఇటీవలే 'ధడక్‌'గా హిందీలోకి రీమేక్‌ అయిందన్నా ఆ రియలిస్టిక్‌ అప్రోచే కారణం. డ్రమెటిక్‌ అప్రోచ్‌తో హ్యాపీ ఎండింగ్‌కి వెళ్లే కంటే కాస్త ధైర్యం చేసి సినిమాటిక్‌ ఎండింగ్‌ని విడిచిపెడితే ఇలాంటి చిత్రాలు ఎఫెక్టివ్‌గా అనిపించే అవకాశాలు ఘనం. ఎక్కడో దొరికిన డైరీలో కథ చదివి విడిపోయిన జంటని కలపడానికి వేరెవరో పూనుకోవడం అనే స్క్రీన్‌ప్లే టెక్నిక్‌ పాతబడిపోయి చాలా కాలమైంది. ఈ త్రెడ్‌ వల్ల పేపర్‌ మరింత పాతబడిందే తప్ప కలర్‌ ఏమీ యాడ్‌ అవలేదనే చెప్పాలి.

ఫీల్‌గుడ్‌ మూమెంట్స్‌, క్లాసీ రొమాన్స్‌కి తోడు కొన్ని పాజిటివ్స్‌ వున్న మాట వాస్తవమే అయినా ఓవరాల్‌గా ఈ పేపర్‌బాయ్‌ డెలివర్‌ చేసింది పాత పేపర్‌లా వుంటుందే తప్ప ఫ్రెష్‌ న్యూస్‌ అనే భావన కలిగించదు. ఉద్దేశం మంచిదే అయినా, ప్రమాణాలు ఉన్నతంగా వున్నా వాస్తవానికి అద్దం పట్టాలా లేక వ్యాపారం కోసం జరంత భద్రంగా వుండాలా అనే సందిగ్ధంలో ఈ ప్రేమకథ మనసులనైతే హత్తుకోదు.

బాటమ్‌ లైన్‌: పాత పేపరే అబ్బాయ్‌!
-గణేష్‌ రావూరి