‘కందిరీగ’తో విజయం సాధించి తిరిగి ఫామ్‌లోకి వచ్చిన రామ్ ఆ తర్వాత ముగ్గురు క్లాస్ డైరెక్టర్లని నమ్మి వారి మీద ఉన్న గుడ్డి నమ్మకంతో వారు చెప్పింది చేశాడు. రెండు హిట్స్ ఇచ్చి ఊపు మీద ఉన్న కరుణాకరన్ దర్శకత్వంలో రామ్ ‘ఎందుకంటే ప్రేమంట’ చేశాడు. ఆ చిత్రం ఏ వర్గాన్నీ ఆకట్టుకోలేక అట్టర్‌ఫ్లాప్ అయింది.
ఆరెంజ్‌తో పాఠం నేర్చుకుని ఉంటాడనుకుని, బొమ్మరిల్లు ఫేమ్ భాస్కర్‌తో నటించడానికి రామ్ రెడీ అయిపోయాడు. అతనేమో తనకి చేతనైంది కాకుండా మాస్ సినిమా చేయడానికి ట్రై చేసి ఒంగోలు గిత్తతో కుమ్మించుకున్నాడు. ఇది గత ఏడాది వచ్చిన అతి పెద్ద డిజాస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది.
త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఎన్నో హిట్స్ ఇచ్చిన విజయభాస్కర్ ఈమధ్య ఫామ్‌లో లేకపోయినా మరీ చెత్త సినిమా అయితే తీయడని, వెంకటేష్‌తో కలిసి ‘మసాలా’ చేస్తే అది కూడా రామ్‌కి నషాలానికి అంటింది. డైరెక్టర్లని నమ్ముకుని బోల్తా కొట్టిన రామ్ ఇప్పటికీ డైరెక్టరే కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటున్నాడు. ముగ్గురు తనని పల్టీ కొట్టించినా కానీ బలుపు ఫేమ్ గోపీచంద్ మలినేని మాత్రం తను మళ్లీ ‘పండగ చేసుకునేలా’ చేస్తాడని బలంగా నమ్ముతున్నాడు.