మూడు సినిమాలు. అదీ కీలకమైన సినిమాలు. ఒకేరోజు విడుదల కాబోతున్నాయి. దీంతో బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు అప్పుడే అవకాశం తీసుకోవడానికి రెడీ అయిపోతున్నట్లు వినికిడి. మామూలుగానే కొనడానికి ఒప్పుకునే మొత్తం ఒకటి, విడుదలకు ముందురోజు, కాస్త కట్ చేసి కట్టేది వేరొకటి అన్నట్లు వుంటుంది బయ్యర్ల వ్యవహారం. ఇప్పుడు ఇంత కాంపిటీషన్ అనగానే ముందుగానే చేతులు ఎత్తేస్తున్నట్లు వినికిడి. థియేటర్లు టైట్ కావడంతో వాళ్ల దగ్గర నుంచి అడ్వాన్స్ లు రావడం కూడా అంతంత మాత్రంగా వుంటుంది.
మూడు సినిమాల్లో ఓ సినిమాకు గుంటూరు జిల్లాకు చెందిన ఓ బయ్యర్ ముందు అనుకున్నంత కట్టలేనని ఇఫ్పుడే చెప్పేసారట. అలాగే అదే సినిమాకు విశాఖకు చెందిన బయ్యర్ కూడా తను కాస్త తక్కువే కట్టగలనని ఓపెన్ గానే అంటున్నారట. మూడు సినిమాల్లో ఈ తలకాయనొప్పి లేనిది రానా సినిమాకే. ఎందుకంటే ఎక్కడా అమ్మలేదు. ఓన్ డిస్ట్రిబ్యూషన్. అందువల్ల వస్తే గిస్తే థియేటర్ అడ్వాన్స్ లు రావాలంతే. అది కూడా మాగ్జిమమ్ ఓన్ థియేటర్లు కాబట్టి ఇక అడ్వాన్స్ ల గొడవాలేదు.
మూడింటిలో ఓ భారీ సినిమాను సీడెడ్ లో కాస్త భారీ రేటుకే కొన్నారు. అక్కడ ఇప్పుడు కనీసం రెండుకోట్లు తేడా వచ్చే ప్రమాదం వుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇదిలా వుంటే థియేటర్లు ఎవ్వరికీ కూడా సరిపడా రావు. ప్రతి ఏరియాలోనూ గీతా అరవింద్, దిల్ రాజు, యూవీ క్రియేషన్స్, సురేష్ మూవీస్, ఏసియన్ సునీల్, ఎన్వీ ప్రసాద్ ఇలా అయిదారుగురు సిండికేట్ లు నిర్వహిస్తూ థియేటర్లు చేతుల్లో వుంచుకున్నారు.
వీళ్లలో ఏసియన్ సునీల్, సురేష్ మూవీస్ రాజు-మంత్రి సినిమాకు దన్నుగా వున్నారు. దిల్ రాజు జయ జానకి నాయక సినిమాకు అండగా వుంటూనే లై సినిమా కూడా కూడా నైజాంలో థియేటర్లు ఇస్తున్నారు. ఇక సీడెడ్ లో ఎన్వీ ప్రసాద్ లై సినిమాకు సపోర్ట్ గా వున్నారు. ఈస్ట్, కృష్ణాలో సురేష్ థియేటర్లు రాజు మంత్రికే. ఆ జిల్లాల్లో గీతా థియేటర్లు లై సినిమాకు వస్తాయంటున్నారు.
ఇలా ప్రతిచోటా థియేటర్లు ఇప్పటికే స్ప్లిట్ అయిపోయాయి. తక్కువ థియేటర్లు పడడం కూడా మంచిదే అన్న టాక్ వినిపిస్తోంది. మంచి షేర్ వస్తుందని లేదూ అంటే ఇన్ని కోట్లు గ్రాస్ వచ్చిందని చెప్పుకోవడం తప్ప ఫలితం వుండదని అంటున్నారు. ఇరవై కోట్లు గ్రాస్ వచ్చింది, పాతిక కోట్లు గ్రాస్ వచ్చింది, మా సినిమా సూపర్ అనడం తప్ప, షేర్ చూస్తే పాతిక శాతం వుండదని, దానికి కారణం భారీగా థియేటర్లు పడడమే అని, తక్కువ థియేటర్లు పడి, ఫుల్స్ వస్తే, మంచి షేర్ వస్తుందని ఇండస్ట్రీ సర్కిళ్లలో వినిపిస్తోంది.
మొత్తం మీద సంక్రాంతికి మించిన హంగామా కనిపిస్తోంది ఇప్పుడు ఇండస్ట్రీలో.