ఎన్టీఆర్ బయోపిక్ మీద బాలయ్య బాబు కాస్త సీరియస్ గానే వున్నారు. కానీ ఇంకా స్టార్ట్ కాలేదు. స్క్రిప్ట్ ఏనాడో రెడీ అయింది. డైరక్టర్ తేజకు దాంతో ఏమాత్రం సంబంధం లేదు కూడా.
బాలయ్య బాబు దగ్గర వున్న స్క్రిప్ట్ ను తెరమీదకు తీసుకురావాలి. అంతే. అయితే జూన్ వరకు తేజ రావడం కష్టం అయ్యేలా వుంది అన్నది ఇండస్ట్రీ టాక్. ఏప్రియల్ లో కానీ వెంకీ సినిమా ప్రారంభం కాదు. అక్కడి నుంచి కనీసం మూడు నెలల్లో తీసేస్తారనుకున్నా జూన్ దాటి పోతుంది.
అప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ కు మిగిలేది గట్టిగా ఆరునెలలు వుండదు. పోనీ ఎంత ప్రీ పొడక్షన్ వర్క్ ఇప్పుడు చేసేసినా, కాస్త గట్టి స్టార్ కాస్టింగ్ కావాలి, అప్పటి పాత్రలకు ఇప్పటి నటులనో, కొత్త వారినో ఎంపిక చేయాలి. పకడ్బందీగా సెట్ లు రూపొందించాలి. గ్రాఫిక్స్ వ్యవహారం కొంత వుండనే వుంటుంది.
ఇవన్నీ ఆరునెల్లలో అయ్యే పనేనా? అన్నది అనుమానం. అయితే ఇండస్ట్రీలో ఇంకో గుసగుస కూడా వినిపిస్తోంది. అవసరం అనుకుంటే బాలయ్య ఒకసారి వేరే డైరక్టర్లను అనుకుని, తేజకు ఇచ్చినట్లే, ఇప్పుడు మళ్లీ మార్చేసినా ఆశ్చర్యం పోనక్కరలేదని.
అసలే మొన్న టీజర్ తరువాత బాలయ్యకు కొంత అసంతృప్తి కలిగినట్లు సమాచారం బయటకు పొక్కింది. అందువల్ల స్టార్ట్ అయ్యేలోగా ఇంకా ఏం జరుగుతుందో చూడాలి.