cloudfront

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: కిరాక్‌ పార్టీ

సినిమా రివ్యూ: కిరాక్‌ పార్టీ

రివ్యూ: కిరాక్‌ పార్టీ
రేటింగ్‌: 2.5/5
బ్యానర్‌: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌
తారాగణం: నిఖిల్‌, సిమ్రన్‌ పరీంజా, సంయుక్త హెగ్దె, రాకేందు మౌళి, బ్రహ్మాజీ, రఘు కారుమంచి, వైవా రాఘవ్‌ తదితరులు
కథ: రిషబ్‌ షెట్టి
కథనం: సుధీర్‌ వర్మ
మాటలు: చందు మొండేటి
కూర్పు: ఎం.ఆర్‌. వర్మ
సంగీతం: బి. అజనీష్‌ లోక్‌నాథ్‌
ఛాయాగ్రహణం: అద్వైత గురుమూర్తి
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
దర్శకత్వం: శరణ్‌ కొప్పిశెట్టి
విడుదల తేదీ: మార్చి 16, 2018

'కిరిక్‌ పార్టీ' అనే కన్నడ సినిమా చూడని వారికి 'కిరాక్‌ పార్టీ' చూస్తుంటే ఇది 'ప్రేమమ్‌' సినిమా నుంచి ఇన్‌స్పయిర్‌ అయి తీసిన సినిమాయేమో అనే అనుమానం కలిగితే తప్పు కాదు. ఎందుకంటే 'ప్రేమమ్‌' కథనే అటు తిప్పి, ఇటు తిప్పి మళ్లీ ఇలా తీసారా అన్నట్టుగా ఆద్యంతం ఆ చిత్రం ఆనవాళ్లతో నిండిపోయింది. కథాబలమున్న చిత్రాలని రీమేక్‌ చేయడం మంచిదే కానీ, చెప్పుకోతగ్గ కథ లేకపోయినా కానీ ఆడియన్స్‌తో కనక్ట్‌ అయిపోయి ఆడేసిన సినిమాల జోలికి పోక పోవడమే మంచిది. ఎందుకంటే కథ లేకుండా అక్కడ చేయగలిగిన మ్యాజిక్‌ని రిపీట్‌ చేయడం, అంతే సక్సెస్‌ఫుల్‌గా తెరకెక్కించడం జరిగే పని కాదు.

'కిరిక్‌ పార్టీ' చిత్రం కన్నడ ప్రేక్షకులకి అంతగా ఎందుకు కనక్ట్‌ అయిందనేది పక్కన పెడితే, కథాపరంగా అందులో చెప్పుకోతగ్గ పాయింటే కనిపించదు. సదరు దర్శకుడి జీవితానుభవాల సారం నుంచో, స్వయంగా చూసిన జీవిత కథ నుంచో సదరు కథ సినిమాగా తెరకెక్కి వుండొచ్చు. అందులోని సోల్‌, ఫీల్‌తో కనక్ట్‌ అయి అక్కడి ప్రేక్షకులు ఎగబడి చూసేసి వుండొచ్చు. మనసులోంచి పుట్టిన కథని తెరకెక్కించడం వేరయితే, తెరపై చూసిన దానిని తిరిగి తీయడం పూర్తిగా మరో పరీక్ష. ఈ చిత్ర దర్శకుడు శరణ్‌ కంప్లీట్‌గా క్లూలెస్‌గా అనిపించాడందుకే.

అసలేం తీసాడో, ఎందుకు తీసాడో, ఎటు తీసుకుపోతున్నాడో తెలియని గందరగోళానికి గురి చేస్తూ, అసలు దీనికి ముగింపు ఏమిటో, ఎలాగిస్తాడో కూడా తెలియనంత దారీ తెన్నూ లేకుండా కథని నడిపించుకుంటూ పోయాడు. ఒరిజినల్‌ కథ ఇదే అయినా కానీ అక్కడ వర్కవుట్‌ అయిన ఫన్‌ ఇక్కడ ట్రాన్స్‌లేట్‌ కాలేదు. అక్కడ కుదిరిన ఎమోషన్స్‌ ఇక్కడ ప్రభావం చూపించలేదు.

అక్కడి వారికి ఇలాంటి క్యాంపస్‌ కథలు కొత్తేమో కానీ తెలుగు ప్రేక్షకులకి వీటితో బాగానే పరిచయం వుంది. అందుకే 'కిరాక్‌ పార్టీ'లో ఏం చూసినా, ఏం చూపిస్తున్నా ఎక్కడో 'చూసినట్టు' అనిపిస్తుంది. ఈ సినిమాకి అదే అతి పెద్ద మైనస్‌. ఎందుకంటే ఇలాంటి సినిమాలు చూస్తున్నప్పుడు 'ఎక్కడో చూసినట్టు' కాకుండా 'స్వయంగా అనుభవించినట్టు' అనిపించాలి. అలా రిలేట్‌ చేసుకోలేనట్టయితే ఇక ఈ కథతో ట్రావెల్‌ చేయడం చాలా కష్టం.

ఈ కథలో ఒక ఎమోషనల్‌ ట్విస్ట్‌ వుంది. ఇంటర్వెల్‌ వరకు ఒకలా కనిపించిన హీరోకి ఒక షాక్‌ తగిలి ఎమోషనల్‌గా మారిపోతాడు. కాకపోతే ఆ షాక్‌ ప్రేక్షకులకి తగిలేట్టు చేయాలంటే అంతవరకు ఆ పాత్రలతో ప్రేక్షకులు కూడా ట్రావెల్‌ చేయాలి. కానీ చాలా అసహజంగా, డ్రామాని తలపించేలా సాగిన ఆ లవ్‌స్టోరీతో కనక్ట్‌ కావడం కష్టం. పోనీ సీరియస్‌గా మారిన హీరో ఇంటర్వెల్‌ తర్వాత మరోలా ప్రవర్తిస్తే అది వేరే సంగతి. గడ్డం పెంచుకోవడం, అమ్మాయిలతో మిస్‌బిహేవ్‌ చేయకండి అని చెప్పడం మినహా అతనిలో ఎలాంటి మార్పు కనిపించదు. ఫస్ట్‌ హాఫ్‌లో ఎంత అల్లరి చిల్లరగా, బాధ్యత లేకుండా వుంటాడో ద్వితియార్ధంలోను అలాగే వుంటాడు.

విచిత్రంగా 'నువ్వు నీలా లేవు. నిన్ను నువ్వు కోల్పోయావు' అంటూ అతనితో పక్క పాత్రలు అంటే తప్ప 'అవునా?' అని అనుకోం. అతనిలోని మార్పులు మనం గుర్తించేంతగా చూపించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. ఆరంభం నుంచీ చాలా సన్నివేశాలు అనర్గళంగా సాగుతూనే వుంటాయి తప్ప క్లుప్తంగా, ఎఫెక్టివ్‌గా అనిపించవు. కామెడీ సన్నివేశాల్లోను ఆ సాగతీత అనుక్షణం విసిగిస్తుంటుంది.

ఈ ధోరణి సినిమా అంతటా అలా కొనసాగుతూనే వుంటుంది. ప్రతి ఎపిసోడ్‌ సుదీర్ఘంగా సాగుతూ 'కిరాక్‌ పార్టీ' కాదిది 'చిరాక్‌ పార్టీ' అనుకునేట్టు చేస్తుంది. పతాక సన్నివేశాల వరకు ప్రభావితంగానే అనిపిస్తాయి. హీరో పాత్రలో పరివర్తన, చివరి సన్నివేశాల్లో భావోద్వేగాలు కాస్త బెటర్‌ ఫీలింగ్‌తో బయటకి పంపిస్తాయి.

నిఖిల్‌ ఇంటర్వెల్‌, క్లయిమాక్స్‌ సన్నివేశాల్లో తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇంటర్వెల్‌ ఫైట్‌ సీన్లో పలికించిన ఎమోషన్‌, ఇంటెన్సిటీ మెప్పిస్తాయి. హీరోయిన్లు ఇద్దరూ మెప్పించలేకపోయారు. సంయుక్తతో పోలిస్తే సిమ్రన్‌ కాస్త నయమనిపిస్తుంది. స్నేహితులుగా నటించిన బృందం బాగానే చేసారు. కాస్త తెలిసిన ముఖాలని పెట్టినట్టయితే వారి మధ్య సన్నివేశాలు ఇంకాస్త బెటర్‌గా అనిపించి వుండేవి. రెండు, మూడు పాటలు బాగున్నాయి. ఛాయాగ్రహణం కూడా ఆకట్టుకుంటుంది. దర్శకుడు శరణ్‌ టెక్నికల్‌గా సినిమాని బాగానే హ్యాండిల్‌ చేసినా ఆకట్టుకునేలా కథ చెప్పడంలో విఫలమయ్యాడు.

హ్యాపీడేస్‌, ప్రేమమ్‌ తదితర చిత్రాల తరహాలో కాలేజ్‌ అనుభవాలని కళ్లకి కట్టినట్టు చూపిస్తుందని, స్లైస్‌ ఆఫ్‌ లైఫ్‌ అనిపిస్తుందని అంచనాలు రేకెత్తించిన చిత్రం కేవలం ఆల్రెడీ చూసేసిన సినిమాలకి పూర్‌ కాపీలా తయారైంది తప్ప రియాలిటీని ఆవిష్కరించలేకపోయింది. యూత్‌ని టార్గెట్‌ చేసిన చిత్రమే అయినా కానీ వారు సైతం పూర్తిగా ఎంజాయ్‌ చేయలేని పార్టీ ఇది. 

బాటమ్‌ లైన్‌: ఇదేం పార్టీ!

- గణేష్‌ రావూరి