'నేను మారాను మొర్రో..' అంటూ నిన్న పదే పదే రామ్‌గోపాల్ వర్మ చెప్పుకున్నారు. 'వర్మా, ప్లీజ్ నువ్వు మారొద్దు, నువ్వు నీలాగే వుండాలి..' అంటూ వర్మకి, నాగార్జున సహా పలువురు హీరోలు, దర్శకులు, నిర్మాతలు సలహా ఇచ్చారు. 'శివ నుంచి వంగవీటిదాకా వర్మ జర్నీ' పేరుతో నిన్న జరిగిన ఓ 'ఈవెంట్'లోని సందడి ఇదంతా.
'నేను మారను, మారనుగాక మారను..' అని వర్మ ఎప్పుడూ చెబుతుండడం తెల్సిన విషయమే. దానికి భిన్నంగా, ఇప్పుడు వర్మ తాను మారానంటున్నారు. ఏం మారడమో ఏమో, ఈ మారడం వల్ల వర్మ సినిమాల్లో మార్పులొస్తాయా.? వర్మ నుంచి వివాదాస్పద వ్యాఖ్యలు ఆగుతాయా.? సంచలనాలకోసం వర్మ పబ్లిసిటీ స్టంట్లు ఇకపై వుండవా.? అంటే, ఇవేవీ లేకుండా వర్మ అనే వ్యక్తిని ఊహించుకోవడమే కష్టం.
'శివ' సినిమా తెలుగు సినీ పరిశ్రమలో ఓ అద్భుతమే. దానికి సీక్వెల్ చేస్తానని వర్మ అంటే, తాను రెడీ.. అంటున్నాడు నాగార్జున. కానీ, ఒకప్పటి వర్మకీ ఇప్పటి వర్మకీ చాలా తేడా. ఒకప్పుడు, వర్మ సినిమాలే సంచలనాలు, ఇప్పుడేమో తన సినిమా ప్రమోషన్ కోసం వర్మ సంచలనాల చుట్టూ పరుగెడ్తున్నారు. అదీ తేడా. వర్మ మారారు.. ఒకప్పటి వర్మ కాదు, ఇప్పుడున్న వర్మ. మళ్ళీ ఇప్పుడు వర్మ మారుతున్నానని అంటే ఆ మార్పు మంచిదే, మళ్ళీ ఇదివరకటి వర్మని చూస్తామేమో. కానీ, అది సాధ్యమేనా.? ఇదిప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నే.