ఏ సినిమాకు అయినా ఒకటే క్లయిమాక్స్ వుంటుంది. మహా అయితే ఇంటర్వెల్ బ్యాంగ్ లో ఓ భారీ ఫైట్, క్లయిమాక్స్ కు ఓ భారీ ఫైట్ వుంటాయి. కానీ త్వరలో రాబోతున్న సాక్ష్యం సినిమాకు అయిదు భారీ ఫైట్లు, అయిదు క్లయిమాక్స్ లు వుంటాయట. దర్శకుడు శ్రీవాస్, హీరో శ్రీనివాస్ బెల్లంకొండ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా పంచభూతాల బ్యాక్ డ్రాప్ లో సాగుతుందట. ఆ విధంగా కధకు అయిదు ఎలిమెంట్స్ వుంటాయట.
అందువల్ల ఈ సినిమా కోసం అయిదు భారీ ఫైట్లు, అయిదు క్లయిమాక్స్ లు ప్లాన్ చేసారట. ఈ ఫైట్లు అన్నీ పీటర్ హెయిన్స్ చాలా భారీగా డిజైన్ చేయడంతో వీటి నిడివినే దాదాపు చాలా వచ్చిందట. ఇప్పుడు పీటర్ హెయిన్స్ వచ్చి, వాటన్నింటినీ క్రోడీకరించి దగ్గర వుండి ఎడిట్ చేస్తాడట. అప్పుడు కానీ సినిమా ఓ కొలిక్కి రాదు. పీటర్ హెయిన్స్ తాను చిత్రీకరించిన ఫైట్లు మరెవరు ఎడిట్ చేసినా, మళ్లీ తను వచ్చి చేసుకోవడం అలవాటు అంట. అందుకే ఆ ముడి అవుట్ ఫుట్ అలా వుంచి, అతగాడి కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.
వాస్తవానికి జూన్ 14న సాక్ష్యం విడుదల కావాల్సి వుంది. కానీ సినిమాకు సిజి వర్క్ కాస్త ఎక్కువే వుంది. మరి అది ఫస్ట్ వీక్ నాటికి రెడీ అవుతుందా? కాదా? అన్నది అనుమానం. సినిమా విడుదల అన్నది ఫస్ట్ వీక్ కు కానీ క్లారిటీ రాదని తెలుస్తోంది. ఎందుకంటే పీటర్ హెయిన్స్ రావాలి. ఎడిటింగ్ వర్క్ కొలిక్కిరావాలి. నాలుగు గంటలకు పైగా వచ్చిన నిడివి మొత్తం సవరించాలి. అలాగే సిజి వర్క్ రావాలి. అప్పుడు కానీ జూన్ 14న విడుదల అన్న దానిపై క్లారిటీ రాదు.
బెల్లంకొండ శ్రీనివాస్ సరసన పూజా హెగ్డె నటించిన ఈ సినిమాలో శరత్ కుమార్, మీనా, జగపతి బాబు వంటి సీనియర్లు కూడా నటించారు.