cloudfront

Advertisement


Home > Movies - Reviews

రివ్యూ: అమ్మమ్మగారిల్లు

రివ్యూ: అమ్మమ్మగారిల్లు

రివ్యూ: అమ్మమ్మగారిల్లు
రేటింగ్‌: 2.5/5
బ్యానర్‌:
స్వాజిత్‌ మూవీస్‌
తారాగణం: నాగశౌర్య, సుమిత్ర, షామిలి, రావు రమేష్‌, సుమన్‌, శివాజీ రాజా, రవికాంత్‌, పోసాని కృష్ణమురళి, సుధ, హేమ తదితరులు
కూర్పు: జె.పి
సంగీతం: కళ్యాణ రమణ
నేపథ్య సంగీతం: సాయికార్తీక్‌
ఛాయాగ్రహణం: రసూల్‌ ఎల్లోర్‌
నిర్మాత: రాజేష్‌
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: సుందర్‌ సూర్య
విడుదల తేదీ: మే 25, 2018

తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేసే పిల్లల కథలు, పంతాలు-పట్టింపులతో తల్లిదండ్రులకి దూరమయ్యే బిడ్డల కథలతో అప్పట్లో ఎన్నో సినిమాలొస్తుండేవి. ట్రెండు మారిన తర్వాత కూడా ఇటీవల 'శతమానం భవతి' లాంటి చిత్రాలు ఈ కాన్సెప్ట్‌తోనే రూపొందాయి. ఇంచుమించు అదే కథాంశంతో, కాస్త భిన్నమైన ట్రీట్‌మెంట్‌తో రూపొందిన చిత్రం 'అమ్మమ్మగారిల్లు'. టైటిల్‌లోనే విషయం ఏమిటనేది బోధ పడిపోతున్న ఈ చిత్రం ఆద్యంతం ప్రేక్షకుల ఊహలకి తగ్గట్టే సాగుతుంది. 

కథలోకి వెళితే... పంతాలు, పట్టింపులతో విడిపోయిన కుటుంబంలో పిల్లలకి దూరమైన తల్లి (సుమిత్ర) తల్లడిల్లిపోతూ వుంటుంది. అయిదుగురు సంతానమైనా కానీ ఇరవయ్యేళ్ల పాటు ఆమె ఇంటి గడప తొక్కిన వాళ్లే వుండరు. ఎలాగైనా అమ్మమ్మగారి ఇంటికి వెళ్లాలనే ఆశతో వున్న మనవడు (నాగశౌర్య) తండ్రి మాట కోసం ఎదురు చూస్తుంటాడు. అమ్మమ్మకి ఆరోగ్యం క్షీణించడంతో ఆస్తి పంపకాల కోసమని పిల్లలందరినీ పిలిపిస్తుంది. అలా అయినా నాలుగు రోజులు కళ్లెదుట వుంటారని ఆమె ఆశ పడుతుంది. కానీ ఒక్క రోజులోనే రిజిస్ట్రేషన్‌ పని ముగించుకుని వెళ్లిపోదామని చూస్తారు. దాంతో వాళ్లని ఆపడానికి మనవడు ఏం చేస్తాడు?

ఒక్కసారి ఆ ఇంట్లోకి అందరూ చేరిన తర్వాత ఇక ఏమి జరుగుతుందనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒంటరి తల్లిని ఇరవయ్యేళ్ల పాటు వదిలేసి, ఆస్తి పంపకాల కోసమని వచ్చిన స్వార్ధపరులైన పిల్లలు ఒక్కొక్కరిలో మార్పు ఎలా వస్తుందనేదే స్క్రీన్‌ప్లే. కొన్ని కదిలించే సన్నివేశాలు, కంటతడి పెట్టించే సందర్భాలు లేకపోలేదు కానీ అంతా ఊహలకి తగ్గట్టు సాగుతూ, రొటీన్‌ సన్నివేశాలు, మందకొడి గమనంతో కాస్త విసిగిస్తుంది అమ్మమ్మగారిల్లు. సెంటిమెంట్‌ సీన్లకి మధ్యలో పెట్టిన నాగశౌర్య-షామిలి లవ్‌ ట్రాక్‌ పేలవంగా వుండడంతో పాటు కామెడీకి షకలక శంకర్‌ మినహా మరెవరూ లేకపోవడం వల్ల ఆ రిలీఫ్‌ కూడా ఎక్కువ లేదు. 

పిల్లలు ఒక్కొక్కరిలో పరివర్తన ఎలాగొస్తుందనేది చూపుతూ, మధ్యలో హీరో హీరోయిన్ల ప్రేమకథని నడుపుతూ సాగిన ఈ చిత్రంలో ఎమోషన్‌ మినహా మరే ఎలిమెంట్‌ పండలేదు. ఎమోషన్‌ కూడా ఒక దశకి చేరిన తర్వాత ఓవర్‌డోస్‌ అనిపిస్తుంది. హెవీ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, చీటికీ మాటికీ కన్నీటి పర్యంతమయ్యే నటీనటవర్గం, తక్కువ లొకేషన్స్‌ వెరసి 'అమ్మమ్మగారిల్లు' వెండితెరపై వెండితెర నటులతో టీవీ సీరియల్‌ చూస్తోన్న భావన కలిగిస్తుంది.

పతాక సన్నివేశాలు దేనితో ముడి పడి వుంటాయనేది కూడా ముందే తెలిసిపోవడంతో ఏ దశలోను ఈ చిత్రం తర్వాత ఏమి జరుగుతుందో తెలుసుకుందామనే కుతూహలం కలిగించదు. అంతగా బావని ద్వేషించిన మరదలు ఇంటర్వెల్‌ తర్వాత కూడా లేట్‌ చేయకూడదన్నట్టు హడావిడిగా ప్రేమలో పడిపోతుంది. ఈ ప్రేమ జంటకి ప్రత్యేక పాటలాంటిది కూడా లేకుండా వారి మీద కంటే మెయిన్‌ ఫ్యామిలీ డ్రామా మీదే ఫోకస్‌ పెట్టడం జరిగింది. అడపాదడపా షకలక శంకర్‌ వచ్చి కాసేపు నవ్వించడం మినహా డ్రామా నుంచి విముక్తి లేకపోయింది. 

నాగశౌర్య, షామిలి ఏదో ముక్తసరిగా నటించేసినట్టు అనిపిస్తుందే తప్ప లీనమైన భావన కలగదు. సగటు బావా మరదళ్ల పాత్రలు కావడం వల్ల ఈ పాత్రలు వారిని కూడా అంతగా ఎక్సయిట్‌ చేసినట్టు లేవు. అమ్మమ్మ పాత్రలో సుమిత్ర, పంతాల పెద్ద కొడుకుగా రావు రమేష్‌ల నటన ఈ చిత్రానికి ప్రధాన బలం. ఇతర తారాగణంలో ప్రతి ఒక్కరికీ ఒక గ్లిజరిన్‌ మూమెంట్‌ అయినా ఇచ్చారు. పోసాని కృష్ణమురళితో వెరైటీ విలనీ చేయించాలని చూసారు కానీ అదేమీ అంత ఎఫెక్టివ్‌గా లేదు. 

ఫ్యామిలీ డ్రామా అయినా పాటలెక్కువ లేవు. ఒక బ్యాక్‌గ్రౌండ్‌ సాంగ్‌, ఒక ఫ్యామిలీ సాంగ్‌ మినహా పాటలు లేకపోవడం కూడా ఈ చిత్రం మరింత హెవీ అనిపించడానికి ఒక కారణమైంది. నేపథ్య సంగీతం అయితే ఎస్‌.ఏ. రాజ్‌కుమార్‌ తరహా ఊకదంపుడు సెంటిమెంట్‌ టోన్‌లో విసిగిస్తుంది. తక్కువ బడ్జెట్‌లో రూపొందిన ఈ చిత్రంలో కళ్లు చెదిరే విజువల్స్‌ కూడా ఏమీ లేవు. శతమానం భవతి రాకపోయినట్టయితే ఈ చిత్రం ఇప్పుడొస్తున్న సినిమాల మధ్య ప్రత్యేకంగా అనిపించేదేమో కానీ అది వచ్చేయడం వల్ల ఇది కేవలం దానికి నకలుగా, ఆ సక్సెస్‌ని చూసి పెట్టుకున్న వాతలా అనిపిస్తుంది. 

ఎమోషన్స్‌ని పండించడం వరకు దర్శకుడు సక్సెస్‌ అయినా కానీ సెంటిమెంట్‌ ఓవర్‌డోస్‌ కాకుండా చూసుకోలేకపోయాడు. అలాగే సెంటిమెంట్‌ దృశ్యాలు మినహా మిగతా వాటి మీద ఎలాంటి శ్రద్ధ వహించకపోవడంతో అప్పుడప్పుడూ మాత్రం కాస్త కదిలించినా, ఎక్కువ సమయం మూస సన్నివేశాలతో ఎప్పుడెప్పుడు అవుతుందా అనిపిస్తుంది. 

సెంటిమెంట్‌ అధికంగా వుండే చిత్రాలు, కుటుంబ ఆప్యాయతలు, అనురాగాలు వగైరా అంశాలున్న సినిమాలు మీకిష్టమైనట్టు అయితే అమ్మమ్మగారిల్లు ఓసారి సందర్శించి రావచ్చు. టీవీ సీరియల్‌ తరహా సెటప్‌ నచ్చకపోయినట్టయితే అమ్మమ్మగారింట ఇబ్బందులు తప్పవు. కొన్ని సెంటిమెంట్‌ సీన్స్‌, కాస్త ఫ్యామిలీ డ్రామా మినహాయిస్తే ఈ ఇంట్లో చెప్పుకోతగ్గ వింతలు, చూడతగ్గ విశేషాలు ఏమీ లేవు. 

బాటమ్‌ లైన్‌: శతమానం భవతి 2!

- గణేష్‌ రావూరి