అయ్యప్పన్ కోషియమ్ అనే మళయాల సినిమా చూసి, ముచ్చటపడి అర్జెంట్ గా హక్కులు కొనుగోలు చేసేసి, రీమేక్ స్క్రిప్ట్ వ్యవహారాలు టేకప్ చేసారు సితార ఎంటర్ టైన్ మెంట్స్ అధినేతలు. ఈ సినిమాను బాలకృష్ణ-రానా కాంబినేషన్ లో చేయాలన్నది ప్రయిమరీ ప్లాన్. రానా అమితంగా ఇష్టపడి, చేయడానికి రెడీగా వున్నారు కానీ పాటలు, ఫైట్లు లేని ఇలాంటి క్యారెక్టర్ చేయడానికి బాలయ్య సిద్దంగా లేరని బోగట్టా.
ఇలాంటి నేపథ్యంలో ఆల్టర్ నేటివ్ ఆప్షన్లు కూడా పరిశీలిస్తున్నారు. రవితేజ, నాగార్జున, ఇలా చాలా పేర్లు వున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమా చూసి, మిడిల్ ఏజ్డ్ పోలీస్ పాత్ర చేసేందుకు సుముఖత వ్యక్తం చేసారు. కానీ ఇక్కడ చాలా సమస్యలు వున్నాయి. ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ మీదే నిర్మించాలి. పవన్ లాంటి పెద్ద హీరోతో హారిక బ్యానర్ వుంచుకుని సితార బ్యానర్ మీద చేస్తే ఎలా వుంటుంది అన్నది ఓ ఆలోచన. అలా అని త్రివిక్రమ్ టచ్ లేకుండా హారిక బ్యానర్ మీద చేయలేరు.
కానీ పవన్ కళ్యాణ్ తాను చేస్తాను అని అన్న తరువాత సితార బ్యానర్ చేయగలిగింది ఏమీలేదు. ఇక్కడే కక్కలేక, మింగలేక వుంది పరిస్థితి. పవన్ కళ్యాణ్ ను రానా ను తీసుకుంటే పాత్రల సమతూకం దగ్గర చాలా తలకాయనొప్పులు వస్తాయి. రానా తండ్రి సురేష్ బాబు ఈ విషయంలో చాలా కీలకంగా చూస్తారు స్క్రిప్ట్ ను. అదీ కాక, పవన్ తో సినిమా అంటే అంతా వెదర్ రిపోర్టు లా వుంటుంది వ్యవహారం. ఆయన ఎప్పుడు వస్తారో? ఎప్పుడు క్యాన్సిల్ అంటారో తెలియదు. అజ్ఞాతవాసితో ఆ అనుభవం పుష్కలంగా వుంది. సోలో హీరో అయితే వేరే సంగతి. కానీ రానా లాంటి హీరోను పక్కన పెట్టుకుని, ఇలా ఓ పద్దతి అంటూ లేకుండా సినిమా తీయడం తలకాయనొప్పి.
ఇదిలా వుంటే యంగ్ డైరక్టర్ సాగర చంద్ర వెర్షన్ ల మీద వెర్షన్లు తయారుచేస్తున్నారు. వినిపిస్తున్నారు. మళ్లీ తయారు చేస్తున్నారు. ఈ స్క్రిప్ట్ యాగం ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు. రానాను ఒప్పించిన తరువాత వెనక్కు తగ్గడానికి లేదు. అందువల్ల రానాతో పాటు సరైన హీరో ఎవరు అన్నది ఫిక్స్ అయ్యే వరకు ఈ సినిమా అప్ డేట్ అన్నది వుండదు.
విజయ్ సేతుపతి, పవన్ కళ్యాణ్ అన్నది పెద్ద బుస్ గ్యాసిప్ అని సితార వర్గాల బోగట్టా. తాము తమిళ సినిమా తీయడం లేదని, విజయ్ సేతుపతిని తీసుకోవడానికి అని, రానాను ఎప్పుడో ఫిక్స్ అయ్యామని సితార వర్గాలు అంటున్నాయి.