ఈ నెలాఖరకు గ్రాండ్ గా రిలీజ్ కానుంది బాహుబలి-2. లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే ఈ సినిమా రన్ టైం లాక్ అయింది. బాహుబలి-ది కంక్లూజన్ సినిమా 2 గంటల 50 నిమిషాల నిడివితో ఉందట. మరోసారి ఫైనల్ రష్ చూసి రన్ టైం లాక్ చేసే ఆలోచనలో ఉన్నాడట జక్కన్న.
నిజానికి బాహుబలి – ది కంక్లూజన్ సినిమాను రెండున్నర గంటల్లోనే ముగించడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు రాజమౌళి. కాకపోతే పార్ట్-1లో ఉన్న కొన్ని ట్విస్ట్ లను కొనసాగించడానికి, సన్నివేశాల మధ్య కొన్ని లింకులను కలపడానికి అదనంగా ఇంకొన్ని సీన్లు జతచేయాల్సి రావడంతో నిడివి 2గంటల 50నిమిషాలు అయిందని తెలుస్తోంది.
బాహుబలి-2 రన్ టైంను 2 గంటల 50నిమిషాలే ఉంచుతారా లేక సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత అందులోంచి ఓ 15 నిమిషాల సన్నివేశాల్ని తొలిగిస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ షార్ట్ ఫిలిమ్స్ కాలంలో దాదాపు 3 గంటల పాటు థియేటర్లలో కూర్చొని సినిమా చూసేంత ఓపిక ఈతరం ప్రేక్షకుడికి లేదు.
ఈమధ్య చాలా సినిమాల్ని, రిలీజ్ చేసిన తర్వాత పబ్లిక్ టాక్ ఆధారంగా సన్నివేశాల్ని తొలిగించడం లాంటి పనులు చేస్తున్నారు. బాహుబలి-2 విషయంలో రాజమౌళి అలాంటి ఆలోచనలో ఉన్నట్టయితే అది పెద్ద రిస్కే అవుతుంది. ఎందుకంటే, భారీ బడ్జెట్ తో వస్తున్న బాహుబలి-2 లాంటి సినిమాకు నెగెటివ్ టాక్ వస్తే కోలుకోవడం చాలా కష్టం.