అనుభవంతో చెప్పేది ఎదైనా బలంగా ఉంటుంది. మనసు లోపలి పొరల్లోంచి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఎదుటి వ్యక్తి ఎంత ఫీల్ అయి చెబుతున్నాడనే విషయాన్ని ఈజీగానే అర్థంచేసుకోవచ్చు. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా అంతే బాగా ఫీల్ అయి చెప్పారని అంతా గ్రహించారు. ఇంతకీ రజనీ ఏం చెప్పారో తెలుసా.
నిర్మాతలు తమ సినిమాల్ని రీజనబుల్ రేటుకు అమ్మాలట. స్టార్ డమ్ ను ఎరగా చూపించి రేటు రెట్టింపు చేసి అమ్మడం వల్ల, తర్వాత సినిమా ఫ్లాప్ అయితే చాలామంది బాధపడతారని అంటున్నారు సూపర్ స్టార్. తమిళ్ ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మొదటి సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు రజనీ.
గతంలో రజనీకాంత్ నటించిన కొచ్చాడయాన్, లింగ, కబాలి లాంటి ఎన్నో సినిమాల్ని భారీ రేటుకు అమ్మారు నిర్మాతలు. తర్వాత ఆ సినిమాలు ఫ్లాప్ అయి డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు వచ్చాయి. కొన్నిసార్లు డిస్ట్రిబ్యూటర్లను రజనీకాంత్ ఆదుకున్నప్పటికీ ఫ్లాపులు వరుసగా రావడంతో ఒక దశలో ఆయన కూడా చేతులెత్తేశారు. ఆ అనుభవంతోనే రజనీకాంత్ ఇప్పుడీ కామెంట్స్ చేశారు.
అయితే సినిమాపై క్రేజ్ ఉన్నప్పుడు డిస్ట్రిబ్యూటర్లు ఎంత బెట్టింగ్ అయినా పెడతారు. ఒరిజినల్ రేటుపై 50శాతం అదనంగా పెట్టడానికి కూడా వెనకాడరు. అలాంటప్పుడు నిర్మాత తన సినిమాను మరింత లాభానికే అమ్మాలని చూస్తారు. అందుకే రజనీకాంత్ డిస్ట్రిబ్యూటర్లకు కూడా సలహా ఇచ్చారు. సినిమా హైప్ ను దృష్టిలో పెట్టుకొని డబ్బులు పెట్టొద్దని, కంటెంట్ చూసి సినిమా కొనాలని సూచిస్తున్నారు. మరి సూపర్ స్టార్ సలహాల్ని ఎంతమంది పాటిస్తారో చూడాలి.