తామేదో హిట్టు కొట్టామని.. రెచ్చిపోయి మాట్లాడకూడదు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి. రాజమౌళిలో ఈ లక్షణాలు ఉన్నాయి కానీ, ఆ పత్రికాధినేత రెచ్చగొట్టడంతో రెచ్చిపోయాడో లేక బాహుబలి ఉత్సాహం అలా మాట్లాడనిచ్చిందో కానీ.. శ్రీదేవి విషయంలో ఆ మధ్య ఈ దర్శకుడు చేసిన వ్యాఖ్యాలు ఇప్పుడు మళ్లీ చర్చలోకి వచ్చాయి. శ్రీదేవి మరణం నేపథ్యంలో.. చివరాఖర్లో ఆమెతో ఎవరెలా స్పందించారనే అంశం చర్చనీయాంశంగా నిలుస్తోంది.
ఈ నేపథ్యంలో రాజమౌళి వ్యాఖ్యలు, ఒక పత్రికాధినేత లేకి మాటలు.. వీటిపై శ్రీదేవి హుందాగా స్పందించిన తీరు.. ప్రస్తావనలోకి వచ్చాయి. బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ పాత్రకు మొదట శ్రీదేవిని అనుకున్నామని.. తమ సినిమాకు శ్రీదేవి వల్ల మరింత భారీ తనం వస్తుందని, దాన్ని హిందీలో కూడా మార్కెట్ చేసుకోవచ్చు అని శ్రీదేవిని సంప్రదించామని రాజమౌళి చెప్పుకొచ్చాడు.
అయితే ఆమె ఎనిమిది కోట్ల రూపాయల వరకూ పారితోషకం అడిగింది అని, అవిగాక.. ప్రతిసారీ ఐదు విమానం టికెట్లు, స్టార్ హోటల్లో కొన్ని రూములు.. బుక్ చేయాల్సిందిగా కోరిందని.. అవన్నీ గాక ఆ సినిమా హిందీ డబ్బింగ్ విడుదల అయితే లాభాల్లో పర్సెంటేజీ అడిగిందని రాజమౌళి చెప్పుకొచ్చాడు.
ఆమె అడిగిందా? అడగలేదా? అనేది తర్వాతి విషయం. ఇంతటితో ఆగకుండా.. ‘ఆమె నటించి ఉంటే.. సినిమా పోయేది..’ అని రాజమౌళి అనడం, దానికి మరింత ఆజ్యం పోస్తూ ఆ ఇంటర్వ్యూ చేసే మనిషి వెకిలి మాటలు మాట్లాడటం.. జరిగింది. అప్పట్లో ఇదంతా చర్చనీయాంశంగా మారింది.
శ్రీదేవిని అలా అవమానించడం, ఆమెను ఆశబోతుగా, ఆమె నటించి ఉంటే.. బాహుబలి సినిమా పోయేదని వ్యాఖ్యానించడం వివాదంగా మారింది. అది అలా ఇలా.. శ్రీదేవి వరకూ వెళ్లింది. ఆ తర్వాత మరోసారి హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ మాటల పట్ల శ్రీదేవి స్పందించింది.
ఆమె నిజాయితీగా ఒక్కటే ప్రశ్న అడిగింది. ‘ఒకవేళ నేను అన్ని కోరికలు కోరేదాన్ని అయితే.. మూడు వందలకు పైగా సినిమాలు చేయగలనా? నా భర్త అడిగాడని అంటారా? ఆయన కూడా ఒక నిర్మాతే.. ఇబ్బందులు పడ్డవ్యక్తే.. అలాంటాయన అడుగుతారా? బాహుబలి గొప్ప సినిమానే, రాజమౌళి గొప్ప డైరెక్టరే.. కానీ ఒక విషయం గురించి అనుచితంగా మాట్లాడేముందు, వేరే వాళ్లపై నిందలేసే ముందు కొంచెం ఆలోచించుకోవాల్సింది.. రాజమౌళి ఇంకా గొప్ప గొప్ప సినిమాలు తీయాలని నేను ఆకాంక్షిస్తున్నాను..’ అని శ్రీదేవి వ్యాఖ్యానించింది.
రాజమౌళికి శ్రీదేవి ఇచ్చిన సమాధానం అల్లాటప్పాగా లేదని వేరే చెప్పక్కర్లేదు. బాహుబలి డైరెక్టర్, ఇంటర్వ్యూ చేసిన మనిషి లేకి లేకిగా మాట్లాడి, వెకిలి నవ్వులు నవ్వితే.. శ్రీదేవి మాత్రం చాలా ఉన్నతమైన రీతిలో మాట్లాడి సమాధానం ఇచ్చింది. ఈ సమాధానం కూడా అప్పట్లోనే చర్చలో నిలిచింది. శ్రీదేవి మరణం నేపథ్యంలో.. ఈ వ్యవహారం మళ్లీ చర్చలోకి వచ్చింది.