బాహుబలితో రాజమౌళికి, ప్రభాస్‌కి జాతీయ వ్యాప్తంగా ఎనలేని కీర్తి ప్రతిష్టలు వచ్చేసాయి కానీ దానితో పాటుగా వచ్చే ప్యాకేజీ కష్టాలు ఇద్దరినీ ఇపుడు ఇరకాటంలో పడేసాయి. పెరిగిన మార్కెట్‌కి అనుగుణంగా సినిమా చేయడం కోసం ఇప్పుడు ఇద్దరూ తంటాలు పడుతున్నారు.
తదుపరి చిత్రం ఏమిటనే దానిపై రాజమౌళి ఇంతవరకు క్లారిటీకి రాలేదు. తెలుగులో తీసి జాతీయ వ్యాప్తంగా అప్పీల్ తెచ్చుకోవడానికి అతనికి మరో బాహుబలిలాంటి బృహత్తర ప్రయత్నం చేయడం ఇష్టం లేదు. రెగ్యులర్ కమర్షియల్ సినిమా ప్లాన్ చేస్తోన్న రాజమౌళికి దానికి జాతీయ మార్కెట్ తీసుకురావడం ఎలాగనేది అంతు చిక్కడం లేదు.
మరోవైపు ప్రభాస్ పరిస్థితి అలాగే వుంది. కథ ఓకే అయిపోయినా కానీ సాహో చిత్రానికి పాన్ ఇండియా అప్పీల్ కోసమే ఇంకా మల్లగుల్లాలు పడుతున్నాడు. బాహుబలి విడుదల కాకముందే మొదలు పెట్టేద్దామని అనుకున్న సాహో పనులు అసలు ముందుకి సాగడం లేదు. అదే తెలుగు మార్కెట్ వరకే పరిమితం అయినట్టయితే ఈపాటికి సాహో సగం పూర్తయిపోయి వుండేది.