నందమూరి బాబాయ్..అబ్బాయ్ ల మధ్య దూరం ఏ మాత్రం తగ్గలేదని, అలాగే వుందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తూనే వుంటాయి. ఈ ఎడాన్ని తగ్గించాలని అబ్బాయిలకు అయితే వుందనే టాక్. కానీ బాబాయ్ వైపు నుంచి మాత్రం అంతగా లేదని వినికిడి. కళ్యాణ్ రామ్ ఎప్పటికప్పుడు బాబాయ్ బాలయ్యతో సఖ్యతగా వుండేందుకే ప్రయత్నిస్తుంటారు. మొన్నటికి మొన్న లోకేష్ ప్రమాణ స్వీకార ఫంక్షన్ కు వెళ్లి బాబాయ్ కు కరచాలనం చేసి మరీ వచ్చారు.
అయితే లేటెస్ట్ గా టాలీవుడ్ లో ఓ కొత్త విషయం వినిపిస్తోంది. బాబాయ్ సినిమా షూటింగ్ కోసం అబ్బాయ్ సినిమా సెట్ ను తీసేసి, వేరే చోటికి షిఫ్ట్ అయిపోయారన్నది ఆ గుసగుస. ఈ విషయం టోటల్ గా ఇలా వినిపిస్తోంది.
అబ్బాయ్ ఎన్టీఆర్ నటిస్తున్న జై లవకుశ సినిమా షూట్ సిటీలో చాలాచోట్ల జరుగుతోంది. అందులో భాగంగానే సారథి స్టూడియోలో చిన్న సెట్ వేసారు. ఇంతలో అక్కడే పోలీస్ స్టేషన్ సెట్ వేసారు బాలయ్య బాబు-పూరి జగన్నాధ్ కాంబినేషన్ సినిమా కోసం. ఈ షూట్ కోసం బాలయ్య బాబు రాగానే ఎవరో చెప్పారట, జూనియర్ సినిమా షూట్ కూడా ఇక్కడే పక్కనే జరుగుతోందని.
అంతే, బాలయ్య బాబు కారవాన్ లోకి వెళ్లిపోయారని, షూటింగ్ స్పాట్ లోకి రాలేదని తెలుస్తోంది. మరి ఓ గంట, రెండు గంటల తరువాత ఏం జరిగిందో కానీ, ఎన్టీఆర్ సినిమా షూట్ షిఫ్ట్ అయిపోయింది. వేసిన ఆ చిన్న సెట్ చకచకా తీసేసారు. దీని వెనుక చాలా గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలయ్య బాబు ఆదేశాల మేరకే అక్కడి నుంచి షూటింగ్ షిఫ్ట్ చేసారని టాక్.
కాదు, అక్కడ వేరే సీన్, అన్నపూర్ణలో తరువాతి సీన్ వుండడంతో షిఫ్ట్ చేసారని కొందరు అంటున్నారు. మొత్తంమీద తెరవెనుక ఏదో జరిగిందన్న గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి.