సినిమా బిజినెస్‌కి అంతగా అనుకూలం కాని సీజన్‌లో రిలీజ్ అవుతుందనే కారణం కావచ్చు.. ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ ఇద్దరూ ఫ్లాపుల్లో ఉన్నారనేది కారణం కావచ్చు.. బండ్ల గణేష్ నిర్మించిన సినిమాల్లో చాలా వరకు యావరేజ్‌గా మిగిలాయనేది కావచ్చు.. కారణం ఏదైనా కానీ ‘టెంపర్’ చిత్రం మోడరేట్ బిజినెస్ చేసింది. మామూలుగా ‘గోపాల గోపాల’లాంటి ప్రయోగాత్మక చిత్రాలని తక్కువ రేట్లకి అమ్ముతుంటారు.
కానీ అన్ని కమర్షియల్ విలువలు ఉన్న మాస్ చిత్రాలని మాత్రం హై రేట్స్‌కి అమ్ముతారు. కానీ టెంపర్ చిత్రాన్ని మాత్రం నలభై రెండు నుంచి నలభై కోట్ల రూపాయలకి అమ్మడం జరిగింది. అంటే థియేట్రికల్ బిజినెస్ నలభై మూడు కోట్లు (షేర్) చేసినట్టయితే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయినట్టు. ఎన్టీఆర్ కెరీర్‌లో ఇంతవరకు బిగ్గెస్ట్ కమర్షియల్ గ్రాసర్ ‘బాద్‌షా’. ఈ చిత్రం నలభై ఏడు కోట్ల షేర్ రాబట్టింది. అయినప్పటికీ హై రేట్స్‌కి అమ్మడం వల్ల ఆ చిత్రానికి కొన్ని ఏరియాల్లో బయ్యర్లు స్వల్ప నష్టాలు చవిచూడాల్సి వచ్చింది.
‘బాద్‌షా’ చిత్రం ఎన్టీఆర్ బ్లాక్‌బస్టర్ కలల్ని సాకారం చేయలేకపోయింది. కానీ ‘టెంపర్’ కనుక ఆ రేంజ్‌లో ఆడినట్టయితే పెద్ద హిట్ సాధించినట్టవుతుంది. ఈ చిత్రానికి కనుక టాక్ బాగా వచ్చి యాభై కోట్ల మార్కుని చేరితే బయ్యర్లందరికీ లాభాల పంట గ్యారెంటీ. ఒకవేళ కాలం కలిసిరాక యావరేజ్‌గా ఆడినా కానీ బయ్యర్లకి భారీ నష్టాలు రాకుండా ఈ మోడరేట్ బిజినెస్ హెల్ప్ అవుతుంది.