‘భయో’ డేటా : ‘కన్నీర్’ బేడీ!

పేరు : కిరణ్ బేడీ Advertisement దరఖాస్తు చేయు ఉద్యోగం : ఢిల్లీ కాషాయ ముఖ్యమంత్రి (బీజేపీ అభ్యర్థిని. ఏరోజున కాషాయం కండువా కప్పుకున్నానో, ఆ రోజే నన్ను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించారు. అప్పుడు…

పేరు : కిరణ్ బేడీ

దరఖాస్తు చేయు ఉద్యోగం : ఢిల్లీ కాషాయ ముఖ్యమంత్రి (బీజేపీ అభ్యర్థిని. ఏరోజున కాషాయం కండువా కప్పుకున్నానో, ఆ రోజే నన్ను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించారు. అప్పుడు తొలిసారిగా గుర్తించాను, సిధ్ధాంతం కన్నా కండువా గొప్పదని.)

ముద్దు పేర్లు : కిరన్ ‘మోడీ’ (అచ్చుతప్పుకాదు, మీరు సరిగానే చదివారు. ఇప్పుడు ఢిల్లీ వోటర్లు ‘బేడీ’లో ‘మోడీ’ ని చూసుకుంటున్నారు) ‘కన్నీర్’ మోడీ( మాజీ పోలీసు అధికారిని కన్నీరు పెట్టటమేమిటీ అని మీరు భావించ వచ్చు. జనాన్ని చూసేటప్పటికి నేను గెలుస్తానేమోనన్న అనుమానం వచ్చేసింది. అంతటి ప్రేమ వారిలో కనిపించింది.)

‘విద్యార్హతలు : అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ ‘ఐపిఎస్’. కాకుంటే అర్థాలు మారుతుంటాయి. ఉద్యోగంలో వున్నప్పుడు ‘ఇండియన్ పోలీస్ సర్వీస్’, ఉద్యమంలోకి వచ్చాక ‘ఇండియన్ పీపుల్స్ సర్వీస్, బీజేపీలో చేరాక, ‘ఇండియన్ పొలిటికల్ సర్వీస్’. అందుకని నన్ను రిటైర్డ్ ఐపిఎస్ అని అననవసరం లేదు. 

గుర్తింపు చిహ్నాలు :

  • ఒకటి: కరడు కట్టిన ఖైదీలను సైతం మార్చగలను. (స్వేఛ్చగా వుండే వోటర్లను మార్చాలి మరి. ఫలితం ఎలా వుంటుందో చూద్దాం.)
  • రెండు: అవినీత వ్యతిరేక ఉద్యమనేత అన్నా హజారే కు నేను ‘కుడి’ చెవిని,( అందుకే ‘రైటిస్టు’లయిన బీజేపీ దగ్గరకు వచ్చాను. కేజ్రీవాల్ ‘ఎడమ’ చెవి. అందుకే ఆయన్ ‘ఆప్’ పార్టీ పెట్టుకుని వామ పక్షాల పరోక్ష మద్దతు తీసుకుంటున్నారు.)

సిధ్ధాంతం : ముందు గా చెప్పానుగా. ఇప్పుడు అన్ని ఇజాలకన్నా, ‘కండువాయిజమే’ దేశంలో నడుస్తోంది. ఇది ‘కమ్యూనిజం’ కన్నా, ‘కమ్యూనలిజం’ కన్నా గొప్పది. అదేమిటో మనకు తెలియకుండా  ఏ రంగు కండువా వుంటే, ఆ రంగు  మాటలే వస్తాయి. 

వృత్తి : అసలు వృత్తి ‘అరెస్టు’ చేయటం. కానీ రాజకీయాల్లోకి వచ్చాక ‘అరెస్టు’కావటమే వుంటుంది. ‘హౌస్’ అరెస్ట్. ‘హౌస్’ అంటే ఇల్లు కాదు. అసెంబ్లీ. కొందరు ఇది నచ్చక వీధిలోకి వచ్చేస్తారు. అందుకే కదా 49 రోజులతో కేజ్రీవాల్ పాలనను ముగించారు. 

హాబీలు :

  1. టెన్నిస్ ఆడటం. ( అందుకనే రాజకీయ క్రీడను కూడా ‘లవ్ ఆల్’ అని మొదలు పెడతాను.) 
  2. అవినీతిని అరికట్టటం.( కానీ ఎంత వరకూ అవినీతి ఎక్కడ వుందో కనుక్కో లేక పోయాను. లేకుంటే బ్లాక్ మనీ అంతా లాగి పారేసే వాళ్ళం.)

అనుభవం : కేంద్రంలో ‘మోడీ’, రాష్ర్టం(ఢిల్లీలో) ‘బేడీ’ అని అందరూ సెటిలయి పోయారు. కానీ బీజేపీలో కొందరు కార్యకర్తలు మాత్రం రెండు చోట్లా ‘మోడీ’యే వుండాలంటున్నారు. ఇది సాధ్యమా చెప్పండి. 

మిత్రులు : బాబాలూ, స్వామీజీలూ, గురువులూ…ఇకమీదట నా భాష ఇలాగే వుంటుంది.

శత్రువులు : మీడియా వారు. నన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాక ‘ఒపీనియన్ పోల్స్’ బీజేపీకి తక్కువ స్థానాలను చూపిస్తున్నారు. 

మిత్రశత్రువులు : ‘లోక్‌పాల్’ ఉద్యమ కారుల్లో కొందరు. 

వేదాంతం : నేనూ, కేజ్రీ ఎవరు గెలిచనా, ఇది ‘అన్నా’ గెలుపే అవుతుంది. 

జీవిత ధ్యేయం : ఢిల్లీ వాసులను.. ఉత్తమ ఖైదీలుగా…. సారీ ఉత్తమ పౌరులగా తీర్చి దిద్దాలని. 

సతీష్ చందర్