‘బాహుబలి’ టీమ్‌ చూస్తోందా ఇదంతా.?

తెలుగు సినీ చరిత్రలో ఇంకే సినిమాపైనా లేనంత హైప్‌ 'బాహుబలి' మీద క్రియేట్‌ అయ్యింది. రేపే థియేటర్లలో 'బాహుబలి' సందడి చేయనుంది. టిక్కెట్ల కోసం నాలుగైదు రోజులుగా అభిమానులు విశ్వప్రయత్నాలు చేస్తూనే వున్నారు. కొందరికి…

తెలుగు సినీ చరిత్రలో ఇంకే సినిమాపైనా లేనంత హైప్‌ 'బాహుబలి' మీద క్రియేట్‌ అయ్యింది. రేపే థియేటర్లలో 'బాహుబలి' సందడి చేయనుంది. టిక్కెట్ల కోసం నాలుగైదు రోజులుగా అభిమానులు విశ్వప్రయత్నాలు చేస్తూనే వున్నారు. కొందరికి థియేటర్లలో టిక్కెట్లు దొరికాయి, ఇంకొందరికి ఆన్‌లైన్‌లో టిక్కెట్లు అందాయి, ఇంకొందరు బ్లాక్‌ మార్కెట్‌ని ఆశ్రయించక తప్పలేదు. చాలామందికి టిక్కెట్లు దొరకలేదు. 

అందరికీ తెల్సిన విషయమే.. టిక్కెట్ల బ్లాక్‌ మార్కెట్‌ మాఫియా వుందనీ, దానికి థియేటర్ల నుంచే మద్దతు లభిస్తుందనీ. అయినాగానీ, బ్లాక్‌ మార్కెట్‌ విషయంలో ఇటు సినీ పరిశ్రమ, అటు ప్రభుత్వం చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నాయి. పైరసీ విషయమై తెలుగు సినీ పరిశ్రమ తరఫున కొందరు మీడియా ముందుకొచ్చి 'బాహుబలి' గొప్పతనాన్ని చెబుతూ, పైరసీకి ఎవరూ పాల్పడరాదని విజ్ఞప్తి చేశారు. 

మరి, టిక్కెట్ల బ్లాక్‌ మార్కెటింగ్‌ విషయంలో ఎందుకు సినీ పరిశ్రమ నుంచి చర్యలు కనిపించడంలేదు.? ఈ ప్రశ్న సహజంగానే సగటు సినీ అభిమానుల్ని వేధిస్తోంది. బ్లాక్‌ మార్కెటింగ్‌ ఆరోపణలతో పలు థియేటర్లపై అభిమానులు దాడులకు దిగుతున్నారు. ఫలానా థియేటర్‌లో 'బాహుబలి' సినిమా ప్రదర్శించడంలేదట.. అని ఆరోపిస్తూ కూడా అభిమానులు థియేటర్లపై దాడులు చేస్తున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా విశాఖలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. థియేటర్‌ వద్ద సినీ అభిమానులు చేసిన యాగీ అంతా ఇంతా కాదు. 

థియేటర్‌ యాజమాన్యాలు విజ్ఞప్తి చేసినా, పోలీసులు రంగంలోకి దూకినా.. అభిమానుల్ని కంట్రోల్‌ చేయడం కష్టం. అదే 'బాహుబలి' టీమ్‌ విజ్ఞప్తి చేస్తే మాత్రం పరిస్థితి కాస్త మెరుగుపడొచ్చు. పెద్ద సినిమా వస్తోంటే, టిక్కెట్‌ ధర తొలి వారం రోజులు.. 100 నుంచి 200 వరకూ అమ్ముతోన్న థియేటర్లు తెలుగు రాష్ట్రాల్లో చాలానే వున్నాయి. ఇది అనధికారిక ధర. ఈ విషయం సినీ పరిశ్రమ దృష్టికి వెళ్ళి వుండదనుకోవడం అమాయకత్వమే అవుతుంది. అయినా మాకేటి సంబంధం? అన్నట్టు వ్యవహరిస్తున్న సినీ పెద్దలు, 'బాహుబలి' విషయంలోనే కాదు, ఏ సినిమా విషయంలోనూ ఇలాంటి పరిస్థితి రాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సి వుంటుంది. 

ఇక, 'బాహుబలి' టీమ్‌ మరోసారి మీడియా ముందుకొచ్చి, అభిమానులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేయకపోతే, రేపు సినిమా విడుదల రోజు పరిస్థితులు మరింత దిగజారతాయి.