నందమూరి బాలకృష్ణ ప్రతిష్ఠాత్మకంగా చేస్తున్న చిత్రం ‘జైసింహా’. ఈ సంక్రాంతికి కూడా మరో హిట్ కొట్టాలన్నట్లుగా బాలయ్య చిత్ర విడుదలకు సిద్ధం అవుతోంది. చాన్నాళ్ల తర్వాత బాలకృష్ణ ఇందులో ప్రేమికుడిగా, ఓ బిడ్డకు తండ్రిగా, యాక్షన్ హీరోగా చాలా వైవిధ్యం ఉన్న పాత్రను పోషిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ‘జైసింహా’ చిత్రం కథ ఎలా ఉండబోతున్నదో కొన్ని వివరాలు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిశాయి. అయితే కథలో ఉండే అసలు ట్విస్టులు మినహా మిగిలిన కథా క్రమాన్ని ఇక్కడ ఇస్తున్నాం.
ప్రకాష్ రాజ్ కూతురు నయనతార. బాలకృష్ణ కూడా ప్రకాష్ రాజ్ ఆశ్రయంలో పెరుగుతూ ఉంటాడు. కాకపోతే.. తన కళ్లెదురుగా ఎలాంటి అన్యాయం అక్రమం జరిగినా బాలకృష్ణ దాన్ని ఎదుర్కొనడానికి గొడవ పడుతూ ఉంటాడు. ఎప్పుడూ బాలయ్య చుట్టూ గొడవలు తిష్టవేస్తూనే ఉంటాయి. బాలయ్య, నయనతార ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని తెలిసినప్పుడు ప్రకాష్ రాజ్ ఓ అభ్యంతరం చెబుతాడు.
‘మీ ప్రేమకు నాకు ఇబ్బంది లేదు గానీ.. నా కూతుర్ని ప్రశాంతమైన జీవనంలో ఉండగా చూడాలని అనుకుంటున్నాను.. కానీ నువ్వు నిత్యం గొడవల్లోనే ఉంటున్నావు’ అని అంటారు. దానికి బాలకృష్ణ స్పందించి.. ‘‘ మీకంటె ఎక్కువ కాదు గురువుగారూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు’’ అంటూ.. అక్కడినుంచి వెళ్లిపోయి మెకానిక్ షెడ్ పెట్టుకుని జీవనం గడుపుతుంటాడు.
ఈ నేపథ్యంలో బాలకృష్ణ వలన ఓ అమ్మాయి (హరిప్రియ) జీవితం కష్టాల్లో పడుతుంది. అందువల్ల ఆ అమ్మాయిని తానే వివాహం చేసుకుంటాడు. ఈలోగా నయనతారకు కూడా మరొకరితో పెళ్లవుతుంది. హరిప్రియ ప్రసవ సమయంలో, నయనతార కూడా ప్రసవానికి వస్తుంది. ఆమెకు పుట్టే బిడ్డ ప్రసవ సమయంలోనే మరణించగా.. బాలకృష్ణ , తన భార్య హరిప్రియ ప్రసవించిన బిడ్డను నయనతార వద్ద పడుకోబెడతాడు. ఆ సంగతి తెలియని నయనతార.. పుట్టినది తన బిడ్డే అనుకుంటూ పెంచుకుంటూ ఉంటుంది.
ఇది ప్రధానమైన కథ.
ప్రేమ, పిల్లలు, కుటుంబ బంధాల మధ్య అల్లిన ఈ కథకు భారీస్థాయిలో యాక్షన్ జోడింపు కూడా ఉంటుంది. ఈ ప్రధాన కథను ఎలివేట్ చేయడంలో అయిదు ఫైట్ లు, రెండు అతి భారీ యాక్షన్ సీక్వెన్స్ లు ఇందులో ఉంటాయి.