మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న 151వ చిత్రం సైరా మొత్తానికి అనేక రకాలుగా వార్తల్లో చిత్రంగా నిలుస్తోంది. ఈ చిత్రం షూటింగ్ కొంత మొదలై ఆగిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే దర్శకుడుగా సురేందర్ రెడ్డి పనితీరుతో చిరంజీవి అంత సంతృప్తికరంగా లేడని.. దర్శకుడిని మార్చేయాలని అనుకుంటున్నారని ఇదివరకే చాలా పుకార్లు వచ్చాయి.
తొలిదశలో స్క్రిప్టు నెరేషన్ తదితర వ్యవహారాల్లో సురేందర్ రెడ్డి చిరంజీవిని మెప్పించినప్పటికీ.. షూటింగ్ మొదలయ్యాక చిరంజీవికి అంతగా నచ్చలేదని ఇండస్ట్రీ భోగట్టా. ప్రత్యమ్నాయంగా మరో దర్శకుడిని కూడా ఇన్వాల్వ్ చేయడానికి చూస్తున్నట్లు చాలాకాలంనుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. వినాయక్ ను, గుణశేఖర్ ను కూడా సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ఏంటంటే.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావును కూడా ఈ సినిమా టేకప్ చేయడానికి సంప్రదిస్తే ఆయన నో చెప్పారుట.
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అంటే.. ఒక పీరియడ్ మొత్తం మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా వెలుగు వెలిగిన సంగతి అందరికీ తెలుసు. మెగాస్టార్ చిరంజీవికి కూడా ఆయన ఎన్నో కమర్షియల్ హిట్స్ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో.. సురేందర్ రెడ్డి టేకింగ్ స్టయిల్ మీదే చిరంజీవికి అసలు అసంతృప్తి ఉన్నట్టు తెలుస్తోంది. ఎక్కువ ఖర్చు పెట్టేస్తుండడంతో పాటూ మాస్ గా తీయాల్సిన ఈ చిత్రాన్ని స్టయిలిష్ గా తీయడానికి ప్రయత్నిస్తున్నాడనే అభిప్రాయం చిరంజీవిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎఫెక్టు ఎక్కడో ఒకచోట దెబ్బకొట్టొచ్చునని చిరు అండ్ కో ఆలోచిస్తున్నట్లు సమాచారం. వినాయక్ ను అడిగితే వేరే కమిట్ మెంట్స్ ఉన్నట్లు చెప్పారని సమాచారం.
గుణశేఖర్ ను సంప్రదిస్తే.. ఆయన చేయడానికి సిద్ధంగానే ఉన్నాడు గానీ.. సురేందర్ రెడ్డి ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఈ మధ్యలో చిరంజీవి పూనుకోవడంతో.. గతంలో ఆయనకు ఎన్నో హిట్ లు ఇచ్చిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావును కూడా సంప్రదించారుట. ఆయన అంత ఆసక్తి చూపించలేదని, ఇప్పుడున్న పరిస్థితే బాగుందని సినిమా చేయబోనని అన్నట్లు తెలుస్తోంది. అయితే సురేందర్ రెడ్డికి రామ్ చరణ్ అనుకూలంగా ఉండడంతో.. దర్శకుడిగా ఆయనను తప్పించకుండా.. గుణశేఖర్ ను కూడా కొంత వాడుకుంటూ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.