ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున నంది అవార్డుల విజేతలను ఎంపిక చేయడానికి కమిటీలు చేస్తున్న కసరత్తులు ఇప్పుడు తుదిదశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. ఉత్తమ నటుల ఎంపిక విషయంలో నందమూరి బాలకృష్ణ అనుమతి తీసుకుని.. ఆ తర్వాత ప్రకటించాలి.. ఎవరిని ఎంపిక చేయాలి? ఎవరిని ఎంపిక చేయకూడదు? అనే విషయాల్లో ఆయన అభిప్రాయాలను ఆఫ్ ది రికార్డ్ గా అయినా తెలుసుకుని.. ఆ మేరకు తాము నడుచుకోవాలి.. అని కమిటీలు ఉత్సాహ పడిపోతున్నాయిట.
2015, 2016సంవత్సరాలకు సంబంధించి నంది అవార్డుల ఎంపిక జరగబోతోంది. అయితే ఇలాంటి సమయంలో నంది అవార్డుల కమిటీలకు కొన్ని ధర్మ సందేహాలు వచ్చాయిట. ఏ హీరోలకు ఉత్తమ నటుడు అవార్డును ఇస్తే ఎలాంటి పితలాటకం పుట్టుకొస్తుందో అని వారు మల్లగుల్లాలు పడుతున్నారు. అందుకని.. సందేహనివృత్తి మరియు మార్గదర్శనం కోసం నందమూరి బాలయ్యను ఆశ్రయిస్తున్నారట. ఆయనతో స్టాంప్ వేయించుకుని, ఆయన అభిప్రాయం మేరకు ఎంపిక పూర్తిచేస్తే ఏ ఇబ్బందీ ఉండదనీ.. ఎవరికి ఎలాంటి అసంతృప్తి వచ్చినా తాము పూచీ తీసుకోవాల్సిన పని లేదని అనుకుంటున్నారుట.
నిజానికి వీరికి ఈ ధర్మసందేహాలు ఉత్తమ నటుడు కేటగిరీలోనే వస్తున్నాయి. 2015 సంవత్సరానికి సంబంధించి ఉత్తమనటుడు పోటీలో నందమూరి తారక రామారావు (జూనియర్ ఎన్టీఆర్), మహేష్ బాబు ఇద్దరూ ఉన్నారు. జూ.ఎన్టీఆర్- టెంపర్ చిత్రంతోను, మహేష్ బాబు- శ్రీమంతుడు చిత్రంతోనూ రేసులో ఉన్నారు. వీరిలో ఎవరిని ఎంపిక చేసినా ఏదో ఒక ఇబ్బంది తప్పదని కమిటీ ఆలోచిస్తోందిట.
పైగా 2016సంవత్సరానికి సంబంధించి జూ.ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ చిత్రాలతో రేసులో ఉన్నాడు. అసలు ఎన్టీఆర్ కు అవార్డు ఇవ్వవచ్చా లేదా? ఇవ్వడం వలన రాజకీయంగా ఇతరత్రా సంకేతాలు ఏమైనా ప్రతికూలంగా ధ్వనించే ప్రమాదాలు పొడసూపుతాయా వంటి విషయంలో కమిటీ తేల్చుకోలేకపోతున్నదిట.
అదే మాదిరిగా 2015లో శ్రీమంతుడు చిత్రానికి మహేష్ బాబును ఎంపిక చేద్దాం అన్నా కూడా వారిలో ఏదో ఒక మీమాంస నడుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగా ఉండే కృష్ణ కుటుంబానికి చెందిన హీరో కావడం వలన.. ఆ ఎంపిక పార్టీకి రుచించకపోతే ఇబ్బంది కదా అని అనుకుంటున్నారట. మరి ఇన్ని పితలాటకాల మధ్య వీరు ఎప్పటికి అవార్డుల సంగతి తేల్చి ఏ ఒక్కరికీ అసంతృప్తి కలగకుండా విజేతల సంగతి ప్రకటిస్తారో చూడాలి.