బాలయ్య అభిమానుల అలక?

అభిమానులే హీరోల సినిమాలకు అండ, దండ. సినిమా ప్రచారానికి ఎన్నికోట్లు ఖర్చు చేసినా, అభిమానులు చేసేది చేయకుండా ఎందుకూ పనికిరాదు. అందుకే మెగాభిమానులను అలా పక్కాగా ఆర్గనైజ్ చేస్తూ, వాళ్లతో ఎప్పుడూ టచ్ లో…

అభిమానులే హీరోల సినిమాలకు అండ, దండ. సినిమా ప్రచారానికి ఎన్నికోట్లు ఖర్చు చేసినా, అభిమానులు చేసేది చేయకుండా ఎందుకూ పనికిరాదు. అందుకే మెగాభిమానులను అలా పక్కాగా ఆర్గనైజ్ చేస్తూ, వాళ్లతో ఎప్పుడూ టచ్ లో వుంటూ, ప్రతి సినిమా విడుదలకు ముందు వాళ్లతో మీట్ లు ఏర్పాటు చేస్తూ వుంటారు. కానీ నందమూరి అభిమానులు అలా కాదు. వాళ్లు ఎన్టీఆర్ కాలం నుంచీ అలా ఆ కుటుంబాన్ని అంటి పెట్టుకుని వుంటున్నారు తప్ప, అక్కడ ఓ ఆర్గనైజింగ్ అన్నది లేదు.

అయితే ఇది గమనించి జూనియర్ ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ ముందు తన అభిమానులందరినీ కబురుచేయడం, కలవడం, ఫోటోలు దిగడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. ఫలితం కనిపించింది కూడా. గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా కోసం బాలయ్య అభిమానులు చేసిన హల్ చల్ ఇంతాకాదు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్లు కూడా బోలెడు ఖర్చుచేసారు. సినిమా ప్రారంభోత్సవం నాటి నుంచి విడుదల వరకు ఏవో ఒక కార్యక్రమం నిర్వహిస్తూనే వచ్చారు. వందో సినిమా కావడంతో వంద బైక్ లతో ర్యాలీలు, వంద ఆలయాల్లో పూజలు, వంద.. వంద అంటూ చాలా చేసారు. వెబ్ సైట్, ఏప్ ఇలా ఇంకా ఎన్నో.

కానీ అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారని తెలుస్తోంది. ఇలా హల్ చల్ చేసిన వారు మొన్నటికి మొన్న జరిగిన బాలయ్య 101వ సినిమా ఓపెనింగ్ లో కనిపించలేదని తెలుస్తోంది. బాలయ్య దగ్గర కొందరు కీలకమైన వ్యక్తుల స్థానాలు మారడంతో అభిమానుల్లో కూడా వర్గాలు ఏర్పడినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. యంగ్ జనరేషన్ అభిమానులు వెనక్కు తగ్గి దూరంగా వున్నారని టాక్. అయితే ఈ అభిమానుల అలకకు కారణం ఏమిటన్నది తెలియాల్సి వుంది.