“అన్నా.. రెండు బాల్కనీ టిక్కెట్లు కావాలి” అంటూ జీర గొంతుతో బాలయ్య డైలాగ్ చెప్పినప్పుడు అంతా ఉలిక్కిపడ్డారు. ఏమైంది ఈ వాయిస్ కి అంటూ ఆరాలు తీశారు. సరేలే ఆ టైమ్ కు జలుబు చేసిందని సర్దుకున్నారు. తీరా థియేట్రికల్ ట్రయిలర్ చూస్తే.. ఇక్కడ కూడా అదే గొంతు. అదేంటి.. బాలయ్యకు సినిమా మొత్తం జలుబు చేసిందా..? లేక వయసైపోయి గొంతు పూర్తిగా అలా మారిపోయిందా..?
పైసా వసూల్ ట్రయిలర్ విడుదలైంది. “ఐయామ్ తేడా సింగ్. దిమాక్ థోడా. చాలా తేడా” లాంటి పంచ్ డైలాగ్ లు పేలాయి. “కసి తీరకపోతే శవాన్ని కూడా మళ్లీ లేపి చంపుతా” లాంటి డైలాగ్స్ అందర్నీ ఎట్రాక్ట్ చేశాయి. ట్రయిలర్ లో పూరి మార్క్ కొట్టొచ్చినట్టు కనిపించింది. ఎటొచ్చి బాలయ్య మార్కే పూర్తిగా మిస్ అయింది.
సింహా, లెజెండ్ లాంటి సినిమాల్లో సెటిల్ గా డైలాగ్స్ చెప్పిన ఆ బాలయ్యేనా ఈ సినిమాలో ఉన్నది అనే అనుమానం వచ్చేలా ఉంది పైసా వసూల్ ట్రయిలర్. అదే జీర గొంతు. వాయిస్ లో ఎనర్జీ పూర్తిగా మిస్. సినిమా మొత్తం ఇదే వాయిస్ ఉంటే మాత్రం.. “ఐయామ్ బాలయ్య.. గొంతు చాలా తేడా” అంటూ పైన చెప్పుకున్న డైలాగ్ ను ఇలా మార్చి చదువుకోవాల్సిందే.