Advertisement


Home > Movies - Reviews
సినిమా రివ్యూ: ఆనందో బ్రహ్మ

రివ్యూ: ఆనందో బ్రహ్మ
రేటింగ్‌: 3/5
బ్యానర్‌: 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్‌
తారాగణం: తాప్సీ, శ్రీనివాసరెడ్డి, షకలక శంకర్‌, వెన్నెల కిషోర్‌, తాగుబోతు రమేష్‌, రఘు కారుమంచి, రాజీవ్‌ కనకాల, రాజా రవీంద్ర, విజయ్‌చందర్‌ తదితరులు
కూర్పు: శ్రవణ్‌ కటికనేని
సంగీతం: కె
ఛాయాగ్రహణం: అనీష్‌ తరుణ్‌ కుమార్‌
నిర్మాతలు: విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి
రచన, దర్శకత్వం: మహి వి. రాఘవ్‌
విడుదల తేదీ: ఆగస్ట్‌ 18, 2017

హారర్‌ కామెడీలని ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తూ వుండడంతో గత అయిదేళ్లలో ఎపుడూ లేనన్ని సినిమాలు ఈ జోనర్‌లో రూపొందాయి. వాటిలో చాలా వరకు విశేషంగా అలరించడంతో పాటు ఘన విజయాన్ని సైతం అందుకున్నాయి. భయపెట్టి మెప్పించడం కంటే భయపడుతూ నవ్వించడం ఈజీ అనే కిటుకు కనిపెట్టి హారర్‌కి కామెడీని జోడించి చాలా మంది దర్శకులు తమదైన శైలిలో నవ్వించారు.

అయితే మంది ఎక్కువయ్యే కొద్దీ మజ్జిగ పలచన అన్నట్టు అదే పనిగా ఈ జోనర్‌లో చాలా సినిమాలు వచ్చేసరికి రొటీన్‌ అయిపోయింది. హారర్‌ సినిమాలకి కొన్ని నిర్ధిష్టమైన పరిమితులు వుండడంతో వాటికి లోబడే ఏం చేసినా చేయాలి. అందరూ అదే ఫార్ములాని పట్టి పిండే సరికి ఇక 'భయ+హాస్య' రసం రావడం లేదు... పిప్పి తప్ప. ఈ విషయం తెలిసినప్పటికీ యువ దర్శకుడు మహి వి. రాఘవ్‌ ఇదే జోనర్‌లో కథ రాసుకున్నాడు.

అదే బంగ్లా, అవే దెయ్యాలు, అక్కడికి వెళ్లే కొందరు మనుషులు... సెటప్‌ అంతా అన్ని హారర్‌ సినిమాల్లానే పెట్టుకున్నాడు. అయితే వెళ్లిన వాళ్లు దెయ్యాలకి భయపడకపోగా తిరిగి వాటికే షాకిస్తే ఎలాగుంటుందంటూ చిన్న ట్విస్ట్‌ ఇచ్చాడు. ఈ క్రమంలో 'ఆనందో బ్రహ్మ'లో నవ్వులు బాగానే పండాయి. దెయ్యాలని చూసి భయపడకుండా వాటిని ఎదిరించడంలో కొత్త రకం వినోదానికి ఆస్కారం దొరికింది. అయితే  ఏదో అలవోకగా దెయ్యాలని ఎదిరించేయడం అన్నట్టు కాకుండా ఆ ఇంట్లోకి వెళ్లిన నలుగురికీ తప్పనిసరి పరిస్థితులు కల్పించి, వారి బలహీనతలతోనే దెయ్యాల పట్ల భయం లేకుండా చేసి తెలివిగా వినోదాన్ని పండించారు.

షకలక శంకర్‌ చేసే పేరడీ కామెడీ బాగా నవ్విస్తుంది. పవన్‌ కళ్యాణ్‌, కె.ఏ. పాల్‌, బాబా రామ్‌దేవ్‌ని ఇమిటేట్‌ చేస్తూ శంకర్‌ చిక్కని హాస్యాన్ని పండించాడు. ముఖ్యంగా జల్సా పేరడీ సీన్‌కి విపరీతమైన అప్లాజ్‌ వచ్చింది. వెన్నెల కిషోర్‌కి వినికిడి లోపంతో పాటు రేచీకటి కూడా పెట్టి ఆ క్యారెక్టర్‌తోను జెన్యూన్‌ ఫన్‌ మూమెంట్స్‌ చాలా క్రియేట్‌ చేసారు.

శ్రీనివాసరెడ్డి టైమింగ్‌, తాగుబోతు రమేష్‌ టిపికల్‌ హ్యూమర్‌ కూడా కలిసి రావడంతో వీళ్లు నలుగురూ కలిసి చేసిన కామెడీ ఒక ఇరవై అయిదు నిమిషాల పాటు నాన్‌స్టాప్‌గా నవ్విస్తుంది. తాప్సీ, కారుమంచి రఘు, విజయ్‌ చందర్‌ ప్రత్యేకించి చేయడానికి ఏమీ లేదు కానీ తమ పాత్రల వరకు బాగానే పోషించారు. కీలకమైన పాత్ర పోషించిన రాజీవ్‌ కనకాల ఎప్పటిలానే మెప్పించాడు.

అసలు కథ మొదలు పెట్టడానికి దర్శకుడు చాలా సమయం తీసుకున్నాడు. కథలోకి వెళితే... ఒక ఇంటిని అమ్మాలని చూస్తుంటారు కానీ అందులో దెయ్యాలున్నాయనేది అందరి భయం. దాంతో ఎవరైనా కొందరు అందులో ఏ భయం లేకుండా వుంటే ఇల్లు అమ్ముడుపోతుందని ఓ వ్యక్తికి (శ్రీనివాసరెడ్డి) ఇరవై శాతం కమిషన్‌ ఆఫర్‌ చేస్తాడు ఓనర్‌ (రాజీవ్‌ కనకాల). అవసరాల్లో వున్న మరో ముగ్గురిని (వెన్నెల కిషోర్‌, రమేష్‌, శంకర్‌) తీసుకుని ఆ ఇంట్లోకి ప్రవేశిస్తాడా వ్యక్తి.

ఈ తతంగం అంతా చెప్పడానికే ఫస్ట్‌ హాఫ్‌ మొత్తం ఖర్చు చేసేయడంతో భయపెట్టడానికి, నవ్వించడానికి ప్రథమార్ధంలో ఎక్కువ వీలు చిక్కలేదు. దెయ్యాలతో వీళ్ల నలుగురి ముఖాముఖి, అవి ఎదురు పడ్డప్పుడు వీళ్లిచ్చే రియాక్షన్స్‌ నుంచే కామెడీ పండింది. ప్రథమార్ధం అంత ఎక్సయిట్‌ చేయకుండా ఫ్లాట్‌గా వెళ్లిపోయినా ద్వితీయార్ధంలో వచ్చే కామెడీ ఆ లోటు చాలా వరకు తీర్చేస్తుంది. ఇక ముగింపు కోసం దెయ్యాలకో బ్యాక్‌ స్టోరీ వుండాలి కనుక చిన్న ట్విస్టుతో ఎండ్‌ చేసారు. అదేమంత గొప్ప ట్విస్టు కాదు కానీ ఓకే అనిపిస్తుంది.

నలుగురికీ వున్న సమస్యలు సాధారణంగా వున్నాయి. ఈ సమస్యల ద్వారా కామెడీకి స్కోప్‌ పెంచుకుని వుంటే ఫస్ట్‌ హాఫ్‌ ఇంకా ఎంటర్‌టైన్‌ చేసి వుండేది. అలాగే ముగింపు కూడా హిలేరియస్‌గా ప్లాన్‌ చేయకుండా కాస్త క్లాస్‌ టచ్‌ ఇచ్చి మెలోడ్రామాతో నింపారు. ఫ్లాష్‌బ్యాక్‌ సంగతి ఎలావున్నా ముగింపు పరంగా హాస్యానికి పెద్ద పీట వేయాల్సింది. ఈ జోనర్‌లో వచ్చే సినిమాలు సహజంగా మాస్‌ని టార్గెట్‌ చేస్తుంటాయి.

మాస్‌ ఎంజాయ్‌ చేసే మూమెంట్స్‌ క్రియేట్‌ చేసి మెజారిటీ ఆడియన్స్‌ని మెప్పిస్తుంటాయి. ముని సిరీస్‌ సక్సెస్‌కి, రాజుగారి గదిలాంటి చిత్రాలు అంత పెద్ద హిట్‌ అవడానికి అదే కారణం. దర్శకుడు మహి మాత్రం తన సినిమాలో నాటు హాస్యం కంటే క్లెవర్‌ హ్యూమర్‌ వుండేట్టు చూసుకున్నాడు. ఇది ఒక వర్గం ప్రేక్షకులని మెప్పిస్తుంది కానీ మాస్‌ నుంచి ఎంత రెస్పాన్స్‌ వుంటుందనేది చూడాలి.

లో బడ్జెట్‌ సినిమా అయినా కానీ టెక్నికల్‌గా బాగుంది. ఎడిటింగ్‌, సౌండ్‌ డిజైన్‌ ప్లస్‌ పాయింట్స్‌. దాదాపుగా ఇన్‌డోర్స్‌లో జరిగే సినిమాకి ఆ ఇరుకు ఫీలింగ్‌ రాకుండా సినిమాటోగ్రాఫర్‌ పనితనం మెచ్చుకోతగినది. పాటలు లేపోవడం వల్ల మూడ్‌ డైవర్ట్‌ కాదు. జెన్యూన్‌ హారర్‌ మూమెంట్స్‌ లేకపోవడం మాత్రం మైనస్సే. దెయ్యాలని లెక్క చేయకపోవడమనేది కథాంశమైనప్పటికీ ఆరంభంలో భయపెట్టడానికి చాలా స్కోప్‌ వుంది. కానీ ఆ దిశగా ఎక్కువ ఎఫర్ట్స్‌ పెట్టినట్టు అనిపించదు. దెయ్యాలు మరీ మంచివి అయిపోవడం వల్ల, ఆరంభంలోనే వాటిని వీక్‌గా చూపించడం వల్ల హారర్‌ ఎలిమెంట్‌ పలచబడిపోయింది.

సెకండాఫ్‌లో నిరాటంకంగా కాసేపు నవ్వులు పండించే ఈ చిత్రం మిగతా భాగంలో పాసబుల్‌గా నడుస్తుంది. ఓవరాల్‌గా ఓకే అనిపించే ఈ చిత్రం జోనర్‌ ఫాన్స్‌కి చిన్నపాటి మార్పుతో కూడిన వినోదాన్ని అందిస్తుంది. స్టార్స్‌ లేకపోవడం వల్ల భారీ అంచనాలు వుండవు కనుక ఈ చిన్న చిత్రం శాటిస్‌ఫాక్టరీగానే అనిపిస్తుంది. జోనర్‌ ఫాన్స్‌కి ఒకసారి చూసేందుకు ఎలాంటి అభ్యంతరాలు, నిట్టూర్పులు వుండవనే చెప్పాలి. బడ్జెట్‌ లిమిట్‌లో వుండడం బాక్సాఫీస్‌ పరంగా అడ్వాంటేజ్‌ అవుతుంది.

బాటమ్‌ లైన్‌: భయపెట్టదు కానీ నవ్విస్తుంది!

- గణేష్‌ రావూరి