Advertisement


Home > Movies - Movie Gossip
నందమూరి కాంపౌండ్ లో 'కమ్మ'నైన బ్యానర్

నందమూరి కాంపౌండ్ లో ఇప్పటికే పలు బ్యానర్లు ఉన్నాయి. కానీ ప్రస్తుతం అందులో యాక్టివ్ గా ఉన్న బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ మాత్రమే. ఈ బ్యానర్ పై ఎక్కువగా కల్యాణ్ రామ్ సినిమాలు చేస్తుంటాడు. తాజాగా ఎన్టీఆర్, జైలవకుశ సినిమా చేశాడు. దీన్ని మినహాయిస్తే యాక్టివ్ గా ఉండే బ్యానర్ ఇంకోటి లేదు. ఇప్పుడీ లోటును బాలయ్య తీర్చబోతున్నాడు. 

అన్నీ అనుకున్నట్టు జరిగితే ఓ సరికొత్త బ్యానర్ ను సృష్టించాలని బాలకృష్ణ భావిస్తున్నాడట. అదే బ్యానర్ పై విడతలవారీగా తను హీరోగా సినిమాలు నిర్మించాలనేది బాలయ్య ప్లాన్. కేవలం తన పేరు మీద బ్యానర్ పెట్టకుండా దీనికోసం సరికొత్త సమీకరణాలకు బాలయ్య పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.

కొత్త బ్యానర్ కోసం తన సామాజిక వర్గానికి చెందిన పలువురు ప్రముఖుల్ని ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడట బాలయ్య. వీళ్లలో కొంతమంది రాజకీయ ప్రముఖులతో పాటు మీడియా టైకూన్ రామోజీరావు పేరు కూడా వినిపిస్తోంది. ఇలాంటి ప్రముఖులతో కలిపి ఓ బ్యానర్ ఏర్పాటుచేసి, దాని వ్యవహారాల్ని తను పర్యవేక్షించేలా ఓ సెటప్ ఏర్పాటుచేయాలని చూస్తున్నాడట బాలకృష్ణ.

నిజానికి ఎన్టీఆర్ బయోపిక్ తోనే నిర్మాతగా మారాలనుకున్నాడు బాలయ్య. కానీ అప్పటికి ఈక్వేషన్లు సెట్ కాకపోవడంతో ఆ సినిమా వ్యవహారాల్ని సాయికొర్రపాటికి అప్పగించాడు. ఇకపై మాత్రం కనీసం రెండేళ్లకు ఒక సినిమా అయినా సొంత బ్యానర్ లో చేయాలని అనుకుంటున్నాడట బాలకృష్ణ. 

త్వరలోనే కొడుకు మోక్షజ్ఞను పరిశ్రమకు పరిచయం చేయబోతున్నాడు. తను కూడా రామానుజాచార్య లాంటి విభిన్నమైన కథాంశాలను ఎంచుకొని సినిమాలు చేయబోతున్నాడు. ఇలాంటి టైమ్ లో సొంత బ్యానర్ ఉంటే మరింత సౌకర్యంగా ఉంటుందనేది బాలయ్య ఫీలింగ్. అయితే నటసింహం మనసెరిగి నడుచుకునే సొంత సామాజిక వర్గ ప్రముఖులు ఎంతమంది ఈ బ్యానర్ లో భాగస్వాములుగా చేరుతారనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

బాలయ్య బ్యానర్ పెడితే అందులో డబ్బు పెట్టడానికి చాలామంది నేతలు, పారిశ్రామికవేత్తలు సిద్ధం. ఎందుకంటే ప్రస్తుతం క్రియాశీల రాజకీయాల్లో ఉన్న బాలయ్యను మచ్చిక చేసుకుంటే మంచిదే కదా. పార్టీకి ఫండ్ ఇచ్చినట్టు, బాలయ్య బ్యానర్ కు కూడా నిధులు ఇస్తే సరిపోతుంది. పైగా అన్నీ అధికారికమే.

అయితే బాలయ్యతో దోస్తీ అంటే అది అంత ఈజీ కాదు. ఆయన మూడ్, మనసు అర్థం చేసుకొని నడుచుకోవాలి. అలాంటి వాళ్లే బ్యానర్ లోకి అడుగుపెట్టాలి. లేదంటే ఒక్కోసారి వ్యవహారం ప్రాణాలమీదకొస్తుంది. సొంత బ్యానర్ స్థాపనలో జాప్యం జరగడానికి ఇది కూడా ఓ కారణమని తెలుస్తోంది.

మెగా కాంపౌండ్ లో ఇప్పటికే పలు బ్యానర్లున్నాయి. చిరంజీవి, అల్లు అరవింద్, నాగబాబుకు ప్రత్యేకంగా నిర్మాణ సంస్థలున్నాయి. వీటికి తోడు బన్నీ కూడా ఓ బ్యానర్ పెడతాడంటూ ప్రచారం జరుగుతోంది. గీతాఆర్ట్స్-2 కూడా ఉండనే ఉంది. మరోవైపు వి-4 మూవీస్ బ్యానర్ కూడా మెగా కాంపౌండ్ కిందకే వస్తుంది.

సో.. వీళ్లకు పోటీగా ఓ బలమైన బ్యానర్ స్థాపించడమే బాలయ్య లక్ష్యంగా కనిపిస్తోంది. అదెంత బలంగా ఉండాలంటే వందల కోట్లు పెట్టి ఓ భారీ బడ్జెట్ సినిమాను అలవోకగా తీయగలగాలి. ఒకవేళ అది ఫ్లాప్ అయినా బ్యానర్ లో భాగస్వాములంతా 'కమ్మ'గా ఫీలవ్వగలగాలి.