ఎస్పీ బాల సుబ్రమణ్యం… తెలుగు పాటకు ఒకానొక నిర్వచనం. 40 యేళ్ల ప్రస్థానంలో బాలూ తెలుగు వాళ్లకు అమిత ఇష్టమైన గాయకుడిగా పేరు తెచ్చుకొన్నాడు. ఆయన పట్ల తెలుగు వాళ్లకు ఉన్న ఆదరాభిమానాల గురించి పదాల్లో చెప్పడం కూడా అంత సామాన్యమైన విషయం కాదు. అంతేనా.. బాలూ ఎంతో మంది యువగాయనీ గాయకులను కూడా తీర్చిదిద్దాడు.
పాడుతా తీయగా, పాడాలని ఉంది.. వంటి కార్యక్రమాల ద్వారా పసిగాయకులకు బాలు ఎంతో శిక్షణినిచ్చాడు. ఎలా పాడాలి.. ఏ పదాన్ని ఎలా పలకాలి… ఏ అక్షరాన్ని ఎలా ఉచ్ఛరించాలి.. అనే విషయాల గురించి కూడా బాలూ డీటైల్డు నోట్ ను ఇస్తుంటారా కార్యక్రమాల్లో. ఇలా బాలూ తెలుగు గురించి వర్ధమాన గాయకులకు శిక్షణ ఇవ్వడం సూచనలు చెప్పడం దశాబ్దాలుగా జరుగుతున్న పని.
అంతేనా.. కొంతమంది గాయకుల విషయంలో కూడా బాలూ ఘాటుగా స్పందిస్తూ ఉంటారు. వారు తెలుగు పాటలు పాడుతూ మన భాషను ఖూనీ చేస్తుంటారని బాలూ చెబుతుంటారు. అలా బాలూ తప్పుపట్టిన వారిలో చిత్ర లాంటి వాళ్లు కూడా ఉన్నారు. “నా పాటకు “చిత్ర''వధ తోడైంది..'' అని బాలూ గతంలో ఒకసారి వ్యాఖ్యానించారు. మళయాళీ అయిన చిత్ర తెలుగు పదాలను సరిగా పలకలేకపోతోందని.. దీంతోతనతో పాటు ఆమె యుగళగీతాలు పాడేటప్పుడు ఇబ్బంది ఎదురవుతోందని వెనుకటికి గానగంధర్వుడు అలా చెప్పాడు.
ఇదీ.. బాలసుబ్రమణ్యం భాష విషయంలో వ్యవహరించే కచ్చితత్వ తీరు. మరి అందరికీ ఆ విధమైన బోధన చేసిన ఎస్పీజీ ఇంట్లో మాత్రం శ్రద్ధ వహించినట్టుగా లేరు. తాజాగా ఎస్పీ బాలూ తనయుడు ఎస్పీ చరణ్ ఇంటర్వ్యూ ఇస్తూ.. తనకు తెలుగు సరిగా రాదనే విషయాన్ని చెప్పాడు.
తనపై తమిళం ప్రభావం ఉందని.. చెన్నైలో పుట్టి పెరిగినందువల్ల తెలుగు సరిగారాదని.. ఇంట్లో అప్పుడప్పుడు తెలుగు మాట్లాడటం వల్ల కొంచెం కొంచెం బాషతో పరిచయం ఉందని.. స్టేజీలపై తండ్రి మాట్లాడే మాటల ద్వారా బాషను గమనిస్తుంటానని చరణ్ చెప్పాడు.
ఈ విషయాన్ని నిజాయితీగా ఒప్పుకొనందుకు చరణ్ ను అభినందించాలో.. ఎంతో మందిని తెలుగు భాష విషయంలో తీర్చిదిద్దిన గానగంధర్వుడి తనయుడికి తెలుగు రాదని బాధపడాలో అర్థం కావడం లేదు.