భరత్ అనే నేను సినిమాకు సంబంధించి ఇప్పటికే కొత్త తరహా ప్రచారంతో అందర్నీ ఎట్రాక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఓథ్, విజన్ ఆఫ్ భరత్ లాంటి పేర్లతో ప్రేక్షకుల్ని బాగానే ఆకర్షించారు. ఇలాంటివి మరిన్ని యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఒకెత్తయితే.. తాజాగా యూనిట్ తీసుకున్న ఓ నిర్ణయం మరో ఎత్తు. అవును.. భరత్ అనే నేను సినిమాకు ఏకంగా 20 రోజుల పాటు ఎక్స్ క్లూజివ్ గా ప్రమోషన్ ఇవ్వాలని నిర్ణయించారట.
ఏప్రిల్ 1నుంచి సినిమా విడుదలైన రోజు వరకు ఏదో ఒక రూపంలో భరత్ అనే నేను చిత్రానికి ప్రచారం కల్పించబోతున్నారు. ఈ మేరకు 20 రోజులకు సరిపడా యాక్షన్ ప్లాన్ కూడా రెడీ అయిపోయింది. ప్రేక్షకుల్ని ఆకర్షించడం కోసం ప్రతి రోజు ఏదో ఒకటి కొత్తగా చేయబోతున్నారు.
ఈ మధ్య తన సోషల్ మీడియా టీమ్ ను మార్చేశాడు మహేష్. కొత్త టీం వచ్చిన తర్వాత సరికొత్త ప్రచార కార్యక్రమాలు తెరపైకి వచ్చాయి. వాళ్ల ఆధ్వర్యంలోనే 20 రోజుల పాటు పలు యాక్టివిటీస్ నిర్వహించబోతున్నారు. మరోవైపు రెగ్యులర్ గా ఉండే ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు, ప్రీ-రిలీజ్ ఫంక్షన్లు లాంటి కార్యక్రమాలకు కూడా అదనంగా మరికొన్ని ప్లాన్ చేశారు.
ఇవన్నీ చేయాలంటే ఈ నెలాఖరుకు భరత్ అనే నేను సినిమా షూటింగ్ పూర్తవ్వాలి. ఈ మూవీకి సంబంధించి ఇంకా లండన్ షెడ్యూల్ పెండింగ్ లోనే ఉంది. మరో 2 పాటలు కూడా బాకీ ఉన్నాయి. మరి ఈ 15 రోజుల్లో ఇవన్నీ పూర్తవుతాయా అనేది డౌట్.