మొన్నటివరకు త్రివిక్రమ్, దేవిశ్రీప్రసాద్ కు పడలేదంటూ వార్తలొచ్చాయి. అందులో అంతోఇంతో నిజం కూడా ఉంది. కానీ ఇప్పుడు త్రివిక్రమ్ తో పాటు అల్లు అర్జున్ కూడా దేవిశ్రీ ప్రసాద్ తో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడట. ప్రస్తుతం చేస్తున్న సినిమాతో పాటు, త్వరలోనే సెట్స్ పైకి తీసుకురాబోతున్న మూవీకి కూడా దేవిశ్రీప్రసాద్ ను తీసుకోలేదు బన్నీ.
ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో నా పేరు సూర్య సినిమా చేస్తున్నాడు బన్నీ. దీనికి దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు కాదు. ఈ మూవీ తర్వాత ఓ యంగ్ డైరక్టర్ ను పరిచయం చేస్తూ మరో మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమాకు కూడా దేవిశ్రీని మ్యూజిక్ డైరక్టర్ గా తీసుకోలేదట.
ఒకప్పుడు అల్లు అర్జున్ సినిమా అంటే ఆ ప్రాజెక్టుకు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ ఇవ్వాల్సిందే. వీళ్లిద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ ఆ రేంజ్ లో ఉండేది. తను చేస్తున్న సినిమాల్లో ఒక సినిమాకు మిస్ అయినా, ఆ వెంటనే నెక్ట్స్ సినిమాకు దేవిశ్రీని మ్యూజిక్ డైరక్టర్ గా తీసుకునేవాడు బన్నీ. అప్పటివరకు కలవని దేవిశ్రీప్రసాద్-పూరి జగన్నాధ్ కాంబినేషన్ ను కూడా సెట్ చేసింది బన్నీనే.
వీళ్లిద్దరి కాంబోలో సన్నాఫ్ సత్యమూర్తి, దువ్వాడ జగన్నాథమ్, ఇద్దరమ్మాయిలతో, జులాయి.. ఇలా ఒకటేంటి చాలా సినిమాలొచ్చాయి. అలా తనకు ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చిన దేవిశ్రీని బన్నీ ఎందుకు పక్కనపెట్టాడనేది ఎవరికీ అర్థం కావడం లేదు.
మరోవైపు దేవిశ్రీనే కావాలని కొన్ని సినిమాల్ని వదులుకుంటున్నాడని అంటున్నారు అతడి సన్నిహితులు. ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉన్న దేవిశ్రీ, త్వరలోనే మరో మ్యూజికల్ టూర్ కు రెడీ అవుతున్నాడు. దానికి సిద్ధమవ్వడం కోసం కొన్ని ప్రాజెక్టుల నుంచి కావాలనే తప్పుకుంటున్నాడట.