హీరో నాని ఇప్పుడు సక్సెస్ ఫుల్ ట్రాక్ లో వున్నాడు. అలాంటి హీరో ఏదైనా మాట్లాడితే అది కాస్త ఆసక్తిగానే వుంటుంది. హీరో నాని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వూలో పెద్ద డైరక్టర్ల విషయంలో కాస్త లాజికల్ గా మాట్లాడాడు.
సినిమాకు అన్నింటికన్నా కాస్టింగ్ నే ముఖ్యం అని, జనం హీరో వైపే 95శాతం చూస్తారు తప్ప, సెట్ ల కేసి, డ్రెస్ ల కేసి కాదని, ఆ కథకు ఆ హీరో సూట్ కావడం ముఖ్యమని అన్నాడు. అంతే కాదు, తనకు విజయాలు అందించింది జనాలు తప్ప, డైరక్టర్లు కాదనట్లు అభిప్రాయ పడడం విశేషం.
ఇదే ఇంటర్వూలో నాని చెప్పిన విషయాలు కొంచెం ఆలోచింపదగ్గవిగా కూడా వున్నాయి. గడచిన పదేళ్లలో తాను చేసిన సినిమాలు చాలా వరకు పెద్దగా పేరున్న దర్శకులతో కాదని. ఆ మాటకు వస్తే చాలా మంది పేరున్నవారు కథలు చెప్పినా రిజెక్ట్ చేసానని నాని వెల్లడించారు.
పెద్ద పెద్ద దర్శకుల సినిమాలు మన కళ్ల ముందే బోల్తా కొట్టడం చూస్తున్నాం కదా? అని నాని కామెంట్ చేయడం విశేషం. ఏ పేర్లూ లేకుండానే జనం తనకు హిట్ లు ఇచ్చినపుడు, ఆ పేర్ల వెనుక తానెందుకు పడాలి అన్నది తన లాజిక్ అంటూ నాని వివరించాడు.
కృష్ణార్జున యుద్ధంపై క్లారిటీ
కృష్ణార్జునయుద్ధం అంటే కృష్ణుడు-అర్జునుడు యుద్ధం చేయడం. అయితే నాని హీరోగా డ్యూయల్ రోల్ తో చేస్తున్న కృష్ణార్జున యుద్ధం సంగతి వేరు. కృష్ణుడు, అర్జునుడు కలిసి వేరేవాళ్లతో యుద్దం చేయడం. ఈ విషయాన్ని ఇదివరకే వెల్లడించాం. ఇప్పుడు నాని కూడా ఓ ఇంటర్వూలో ఇదే విషయాన్ని క్లియర్ గా చెప్పేసాడు. ఎక్కడో విదేశంలోని కుర్రాడు, ఇక్కడ చిత్తూరు నుంచి వచ్చిన కుర్రాడు కలిసి ఓ కామన్ కాజ్ కోసం ఫైట్ చేయడం అంటూ చెప్పాడు.
ఆ కారణం కూడా ఇదివరకే బయటకు వచ్చింది. అమ్మాయిలను ఎత్తుకుపోయి, వ్యభిచార గృహాలకు అమ్మేయడం అనే బ్యాక్ డ్రాప్ లో హీరోయిన్లను ఎత్తుకుపోతే, హీరోలు ఇద్దరు ఫైట్ చేసి, వెనక్కు తెచ్చుకునే కాన్సెప్ట్ అని ఇప్పటికే లీక్ లు బయటకు వచ్చాయి. అంటే గతంలో వచ్చిన కృష్ణ వంశీ గులాబీ టైపు అన్నమాట.