బండ్ల గణేష్‌కి గబ్బర్‌సింగ్ తర్వాత మళ్లీ ఆ స్థాయి హిట్ రాలేదు కానీ తాను తీసే సినిమాలన్నిటితో అతను విడుదలకి ముందే సేఫ్ అయిపోతుంటాడు. కాంబినేషన్లు సెట్ చేసి విడుదలకి ముందే క్యాష్ చేసేసుకునే గణేష్ లక్ కొద్దీ తన సినిమాలకి వచ్చేసరికి హీరోలు కూడా కాస్ట్ కటింగ్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు.
‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రానికి ఖర్చు ఎక్కువ కాకుండా స్వయంగా రామ్ చరణ్ ప్లాన్ చేసాడు. కృష్ణవంశీకి అంతగా క్రేజ్ లేకపోవడంతో తన సినిమా ఖర్చు పెరగకుండా హీరోనే జాగ్రత్త పడ్డాడు. దాంతో బండ్ల గణేష్‌కి ఈ చిత్రంపై మంచి టేబుల్ ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకీ అదే జరుగుతోంది.
రభస, రామయ్యా వస్తావయ్యా ఫ్లాపులతో ఎన్టీఆర్ తన సినిమాల ఖర్చు తగ్గించేస్తున్నాడు. తన పారితోషికాన్ని స్వఛ్ఛందంగా తగ్గించుకుని, పూరి జగన్నాథ్ కూడా తగ్గించుకునేలా చూసాడు. ఇంకా పలు మార్గాల్లో ఖర్చు తగ్గించేసాడు. ఈ చిత్రం కూడా గణేష్‌కి కాసుల పంట పండిస్తుందని అనుకుంటున్నారు. హీరోలే ఖర్చు తగ్గించుకోవడం… అదీ తన సినిమాలకే జరగడం బండ్ల అదృష్టం కాక మరేంటి?