వైద్యుడిని దేవుడిగా భావిస్తాం మనం. దేవుడు మనిషిని సృష్టిస్తే, ఆ మనిషికి అనారోగ్యమొచ్చి చావు బతుకుల మధ్య వున్నప్పుడు ప్రాణం నిలిపేది వైద్యుడే మరి. కానీ, ఆ వైద్యుడూ మనిషే కదా. ఆ వైద్యుడికీ కష్టాలొస్తాయ్.. ఇబ్బందులొస్తాయ్.. ఆ ఇబ్బందులూ ప్రభుత్వాలనుంచే కావడం గమనార్హం.
ఆ మధ్య ఓ రాజకీయ నాయకుడు వైద్యులపై చెయ్యి చేసుకుంటే అప్పట్లో అది పెద్ద రచ్చ అయ్యింది. హైద్రాబాద్‌లో చోటుచేసుకుందీ ఘటన. వైద్యులకు రక్షణ కల్పిస్తే తప్ప వైద్యం చేయలేమంటూ వైద్యులు రోడ్డెక్కారు. ప్రభ్వుం కల్పించుకుంది. అది ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో జరిగింది. జూనియర్ వైద్యులు (జూడాలు అంటున్నాం) తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా వారి సమస్యలు పరిష్కారమవడంలేదు. చేసేది లేక, వారూ సమ్మెబాట పడ్తుంటారు. ఇప్పుడూ తెలంగాణలో జూడాలు సమ్మెలో వున్నారు. ప్రభుత్వానికేం.? హెచ్చరించి ఊరుకుంటుంది. సామాన్యులే వైద్యం అందక హరీమంటున్నారు.
‘ఏం చేయమంటారు.. మా కష్టాలు మావి.. మా సమస్యల్ని అర్థం చేసుకోండి.. మాకు సహకరించండి.. అయినా అత్యవసర సేవలకు ఆటంకం కలిగించడంలేదు కదా..’ అని జూడాలు అంటున్నారు. పరిస్థితి చాలా తీవ్రంగా వుంది. రోగులు చాలా అవస్థలు పడ్తుండడంతో తెలంగాణ సర్కార్, వారిపై కొరడా రaుళిపించేందుకు సిద్ధమవుతోంది. ఎస్మా ప్రయోగిస్తామనే హెచ్చరికలు.. ఆరు నెలలపాటు డిబార్ చేస్తామనే హుకూంలతో తెలంగాణ సర్కార్ జూడాలను ఆందోళనకు గురిచేస్తోంది. జూడాలు వింటారా.? లేదా.? అన్నది ముందు ముందు తెలుస్తుంది.
గతంలో జూడాలు ఆందోళన చేసినప్పుడు ఇప్పుడు అధికారంలో వున్న టీఆర్‌ఎస్ నేతలూ కొందరు, జూడాల ఆందోళన నిజమేనన్నారు. ఇప్పుడు అదే టీఆర్‌ఎస్ అధికారంలో వుంది. అందుకనే వారికి జూడాల ఆందోళన న్యాయంగా కన్పించడంలేదు. అధికారంలో వుంటే సమస్య ఒకలా కన్పిస్తుంది.. అధికారంలో లేకపోతే సమస్య ఇంకోలా కన్పిస్తుంది రాజకీయ పార్టీలకు. అదే రాజకీయం అంటే.