నాస్తిక రామోజీ-ధార్మిక కేంద్రం

చెరుకూరి రామోజీరావు..ఆంద్రదేశంలో బలమైన మీడియా శక్తిమంతుడు. ఇప్పుడు ఆయన కొత్త వెంచర్ వెలుగులోకి వచ్చింది. వయసు మీదపడినా ఎప్పటికప్పుడు కొత్త వెంచర్లు ప్రారంభించి,వాటిని లాభాలబాటలోకి తీసుకువచ్చే వరకు నిద్రపోకుండా శ్రమించే రామోజీని నిజానికి ఎవరైనా…

చెరుకూరి రామోజీరావు..ఆంద్రదేశంలో బలమైన మీడియా శక్తిమంతుడు. ఇప్పుడు ఆయన కొత్త వెంచర్ వెలుగులోకి వచ్చింది. వయసు మీదపడినా ఎప్పటికప్పుడు కొత్త వెంచర్లు ప్రారంభించి,వాటిని లాభాలబాటలోకి తీసుకువచ్చే వరకు నిద్రపోకుండా శ్రమించే రామోజీని నిజానికి ఎవరైనా ఆదర్శంగా తీసుకోవాలి. నలభై దాటితే జీవితం అయిపోయింది..ఇంక రోటీన్ లో పడిపోదాం అనుకుంటారు చాలా మంది. కానీ రామోజీ నలభైలు దాటాకే ఈనాడు సామ్రాజ్యానికి పునాది వేసారు. అప్పటి నుంచి నిరంతరంగా శ్రమిస్తూనే వున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ ఆయన ఆఖరు వెంచర్ అనుకున్నారు. ఆయన కూడా అదే అనేవారు తనకు సన్నిహితుల దగ్గర అని టాక్. అందుకే దానికి తన పేరుపెట్టారు. ఇలా ఓ వెంచర్ కు ఆయన పేరు పెట్టడం ఇదే మొదలు. ఆయన చాలా సార్లు ఇది తన ఆఖరు వెంచర్ అని అన్నారని వార్తలు వినవచ్చాయి. 

అయితే ఇప్పుడు ఆయన మరో వెంచర్ కు, అదీ తెలంగాణలోనే శ్రీకారం చుడుతున్నట్లు వెల్లడయింది,. ప్రధాని మోడీని కలిసిన సందర్భంగా తాను చేపట్టబోతున్న ఓం అనే ధార్మిక కేంద్రానికి సంబంధించిన విజన్ బుక్ ను ఇచ్చారట. బహుశా ఇది రామోజీ ఫిల్మ్ సిటీకి అనుబంధంగానే వుండొచ్చు. ఏముంటాయి అందులో అన్న వివరాలు ఇంకా వెల్లడి కాకపోయినా ఊహాతీతం మాత్రం కాదు.కానీ ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రామోజీ అంత ఆస్తికుడు మాత్రం కాదు. ఆయనకు పెద్దగా నమ్మకాలు లేవు. ముహుర్తాలు వంటివి పట్టించుకున్నట్లు కనిపించరు. పైగా కాస్త వామపక్ష భావజాలం ఎక్కువ కూడా. 

వారఫలాలు లేని సండే సప్లిమెంట్లు లేని రోజుల్లో ఆయన ఈనాడులో వాటిని కనిపించనివ్వలేదు. ఈనాడులో ముహుర్తాలు, జాతకఫలాలు, ఇలాంటివి మచ్చుకైనా వుండేవి కావు. ఇలాంటి మరో దినపత్రిక హిందూ, వార పత్రిక స్వాతి మాత్రమే. అలాంటిది ఈ మూడూ కూడా ఇంచు మించు ఒకేసారి వార ఫలాలు వేయడం ప్రారంభించాయి. అదీ కొన్ని సంవత్సరాల క్రితం నుంచి. 

మిగిలిన వాటి సంగతి అలా వుంచితే ఈనాడు లో ఈ మార్పు, రామోజీ కుమారుడు కిరణ్ హయాం నుంచే ప్రారంభమైందంటారు. ఎందుకంటే రామోజీ కుటుంబంలో కొడుకులు, కోడళ్లు పరమ భక్తులట. తండ్రిమాదిరిగా కాదు. చిన్నకుమారుడు సుమన్ వెంకటేశ్వరస్వామిపై పాటలు రాసి, సంగీతం కూర్చి, విడియోలు తీసి ప్రచారం చేసారు. ఆయన స్వయంగా వెంకటేశ్వర స్వామిగా నటించారు. ఇక కిరణ్, ఆయన భార్య శైలజ తరచు తిరుపతి వెళ్తూనే వుంటారట. కిరణ్ పిల్లలకు బాసర ఆలయంలోనే అక్షరాభ్యాసం చేసారు. కిరణ్ హయాం వచ్చిన తరువాతే ఈనాడు ఎడిటోరియల్ పేజీలో అంతర్యమి అంటూ ధార్మిక వ్యాసాలు ప్రారంభమయ్యాయి. 

మరి ఇలాంటి నేపథ్యంలో రామోజీ ఓం అంటూ తొలిసారి ధార్మిక సంబంధిత వెంచర్ తలకెత్తుకుంటున్నారు.బహుశా దేశంలోని దేవాలయాల ప్రతిబింబాలు, మెడిటేషన్ హాళ్లు, ఇంకా అనేకం ఇందులో వుంటాయేమో? ఇప్పటికే యాదగిరి గుట్ట దగ్గర సురేంద్రపురి అంటూ దేశంలోని వివిధ ఆలయాల నమూనాలు, రామయాణ, భారత ఇతిహాసాల శిల్పరూపాలు ఇంకా,..ఇంకా అనేకం వున్నాయి. దానికి ఆదరణ బాగానే వుంది. మూడు వందల రూపయిలకు పైగా టికెట్ పెట్టినా జనం వెళ్తూనే వున్నారు. బహుశా దాని అడుగు జాడల్లోనే మరింత వైవిధ్యంగా రామోజీ ఈ కేంద్రం నిర్మించే అవకాశం వుంది. 

నిజానికి సురేంద్రపురి కూడా కొత్త, స్వంత అయిడియా కాదు. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం పండరీపురంలో పద్మవ్యూహం పేరిట ఇలాంటిది వుంది. దానికి కాస్త అప్ డేట్ వెర్షన్ గా సురేంద్రపురి వుంటంది. బహుశా దీనికి తరువాతి వెర్షన్ రామోజీ ఓం కావచ్చు.

చాణక్య

[email protected]