మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఓ మనిషికి కష్టం వచ్చినపుడు తెలుసుకున్నవాళ్లు పలకరించడం అన్నది పద్దతి. నిర్మాత బండ్ల గణేష్ కుచెక్ బౌన్స్ కేసులో నాన్ బెయిలబుల్ వారంట్ వచ్చింది. సరే కోర్టుకు వెళ్లారు. ఏదో ఒకటి అయింది. జైలుకు వెళ్లకుండా తిరిగి వచ్చారు. ఈ నేపథ్యంలో పలువురు సినిమా జనాలు బండ్లకు ఫోన్ చేసి ఏమైనా సాయం కావాలంటే చెప్పమని అడిగినట్లు తెలుస్తోంది.
విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం హీరోలు రవితేజ, మహేష్ బాబు ఫోన్ చేసి పలకరించినట్లు తెలుస్తోంది. బండ్లతో ఒకప్పుడు చాలా స్నేహంగా వున్న ఓ మీడియా అధినేత కూడా, గణేష్ భార్యకు ఫోన్ చేసి, భయం ఏమీ లేదని, ధైర్యం చెప్పినట్లు బోగట్టా. అదే మీడియా అధినేత భార్య బండ్ల ఇంటికి వచ్చి, అతని భార్యకు ధైర్యం చెప్పినట్లు తెలుస్తోంది.
ఇలా చాలామంది ఫోన్ చేసారట కానీ, మెగా హీరోలు ఒక్కరు పలకరించలేదని బండ్ల గణేష్ సన్నిహితుల దగ్గర బాధపడినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ను దేవుడు.. దేవుడు అనుకున్నానని, గబ్బర్ సింగ్ లాంటి హిట్ తీసి ఇచ్చానని, తీన్ మార్ సినిమా తీసి నష్టపోయానని, కానీ కనీసం ఓ పలకరింపు లేదని బండ్ల బాధపడుతున్నట్లు తెలుస్తోంది.
అలాగే మరే మెగా హీరో నుంచి కూడా కనీసపు పలకరింపు లేదని అంటున్నాడట. నిజానికి బాకీ ఎగ్గొట్టడం లేదా చెక్ బౌన్స్ అన్నది తప్పేకావచ్చు, ఆ వ్యవహారం అలా వుంచితే, ఏదో కష్టం వచ్చింది కదా? తెలుసున్న మనిషి కదా? అని ఓసారి పలకరించి వుండాల్సింది. తన బాధ, అసలు ఈ చెక్ బౌన్స్ వ్యవహారం ఏమిటి? ఇలా అన్నింటినీ వివరిస్తూ తనే ఓ విడియో బైట్ వదలాలని బండ్ల గణేష్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.