ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా ఇప్పటికే చరిత్ర సృష్టించింది బాహుబలి-2 సినిమా. ప్రస్తుతం భారత్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఏదైనా ఉందంటే అది బాహుబలి-2 మాత్రమే. ప్రస్తుతం ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 792 కోట్ల రూపాయలు వచ్చాయి. అది కూడా జస్ట్ వారం రోజుల్లో. ఈ వీకెండ్ కూడా ఈ సినిమాకు డిమాండ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో బాహుబలి-2 సినిమాకు వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లు రావడం ఏమంత పెద్ద విషయం కాదు.
బాహుబలి-2 సినిమా విడుదలకు ముందు వెయ్యి కోట్లు కష్టమన్నారు చాలామంది. ఎందుకంటే ఇప్పటివరకు బాహుబలి-1, దంగల్, పీకే లాంటి సినిమాలు కంప్లీట్ రన్ లో 8వందల కోట్ల మార్క్ ను కూడా అందుకోలేకపోయాయి. కాబట్టి.. ఎంత పెద్ద హిట్ టాక్ వచ్చినా బాహుబలి-2 వసూళ్లు ఓవరాల్ గా 800 కోట్లు వద్దకు చేరుతాయని అంతా ఊహించారు. కానీ మొదటి వారాంతానికే ఆ ఫీట్ సాధించింది బాహుబలి – ది కంక్లూజన్ సినిమా.
మరోవైపు ఇండియాలో బాహుబలి-2 సినిమాకు బాక్సాఫీస్ వద్ద పోటీ లేదు. తెలుగులో మరో 2 వారాల పాటు బాహుబలికి తిరుగులేదు. అటు బాలీవుడ్ లో కూడా సల్మాన్, అమీర్, హృతిక్ లాంటి పెద్ద హీరోల సినిమాల్లేవు. తమిళ్ లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సో.. మరికొన్ని రోజుల్లో అతిపెద్ద చరిత్రను చూడబోతున్నాం. ఓ తెలుగు సినిమా వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లు సాధిస్తోంది.