పవన్ ఖాతాలో పెండింగ్ ప్రాజెక్టులు

ప్రస్తుతం వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు పవన్. ఒక సినిమా కంప్లీట్ అవ్వగానే మరో సినిమాను సెట్స్ పైకి తీసుకొస్తున్నాడు. ఇలా రెస్ట్ లేకుండా సినిమాలు చేస్తున్నప్పటికీ, పవన్ ఖాతాలో పెండింగ్ ప్రాజెక్టులు మాత్రం అలానే…

ప్రస్తుతం వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు పవన్. ఒక సినిమా కంప్లీట్ అవ్వగానే మరో సినిమాను సెట్స్ పైకి తీసుకొస్తున్నాడు. ఇలా రెస్ట్ లేకుండా సినిమాలు చేస్తున్నప్పటికీ, పవన్ ఖాతాలో పెండింగ్ ప్రాజెక్టులు మాత్రం అలానే ఉన్నాయి. నిజానికి ఆ సినిమాలు ఎప్పుడొస్తాయో.. అసలు వస్తాయో రావో కూడా ఎవరికీ తెలీదు.

దాసరి నారాయణరావుతో కలిసి పవన్ ఓ సినిమా చేయాల్సి ఉంది. ఆ విషయాన్ని అటు పవన్, ఇటు దాసరి ఇద్దరూ నిర్థారించారు. ఆమధ్య కథాచర్చలు కూడా జరిగినట్టు వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం ఈ ప్రాజెక్టు గురించి ఎవరూ మాట్లాడ్డం లేదు. పైగా దాసరి ఆరోగ్యం ఈమధ్య ఏం బాగాలేదు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారాయన. ఇలాంటి టైమ్ లో పవన్-దాసరి ప్రాజెక్టు మరోసారి తెరపైకి వస్తుందని ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయరు.

పవన్-టీఎస్ఆర్ ప్రాజెక్టును కూడా పెండింగ్ ప్రాజెక్టు కిందే చెప్పాలి. ఎందుకంటే, దీనిపై ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. త్రివిక్రమ్ దర్శకత్వంలో చిరంజీవి-పవన్ కాంబినేషన్ లో రావాల్సిన మెగా మల్టీస్టారర్ సినిమా ఇది. ఈ ప్రాజెక్టును ఎనౌన్స్ చేసినప్పుడు చూపించినంత ఉత్సాహం ఇప్పుడు కనిపించలేదు. పైగా పవన్, చిరు, త్రివిక్రమ్ ముగ్గురూ ఫుల్ బిజీ.

పవన్ కెరీర్ లో ఎప్పట్నుంచో నలుగుతున్న మరో సినిమా కోబలి. ఈ సినిమాను ఎప్పటికైనా సెట్స్ పైకి తీసుకొస్తానని పవన్ అప్పుడప్పుడు ప్రకటిస్తుంటారు. ఈ సినిమా కోసమే పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అనే బ్యానర్ కూడా స్థాపించానని అప్పట్లో చెప్పుకొచ్చారు. ఈమధ్య ఈ స్టోరీకి త్రివిక్రమ్ మెరుగులు దిద్దినట్టు వార్తలు కూడా వచ్చాయి. కానీ పవన్ కు ఉన్న వ్యక్తిగత, రాజకీయ, వృత్తిపరమైన కమిట్ మెంట్స్ కారణంగా ఇప్పట్లో కోబలి సెట్స్ పైకి రాదు.

తను నిర్మాతగా, రామ్ చరణ్ ను హీరోగా పెట్టి ఓ సినిమా చేస్తానని పవన్ ప్రకటించారు. పైన మనం చెప్పుకున్న సినిమాలతో పాటు ఇది కూడా పెండింగ్ ప్రాజెక్టు కిందకే వస్తుంది. ఎన్నాళ్ల నుంచో నలుగుతున్న ఈ సినిమా ఎప్పుడు తెరపైకి వస్తుందనేది కచ్చితంగా ఎవరూ చెప్పలేకపోతున్నారు.