అనిల్ సుంకర. ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత. గత వారం రోజులుగా ఈ సంస్థ భలే హడావుడి చేసింది. లేస్తే మనిషిని కాదన్నంతగా. కోర్టు కెళ్తాం. స్టే తెస్తాం.. నోటీసులు ఇచ్చాం. ఇలా తెగ హడావుడి చేసారు. ఇదంతా ఒక్కక్షణం సినిమా మీద.
ఎందుకంటే ఆ సినిమా కంటెంట్, ఎకె రైట్స్ కొనుకున్న పారలల్ లైఫ్ కంటెంట్ ఒక్కటే. ఇంత జరిగాక, వున్నట్లుండి, కథ చెప్పారు. బాగుంది. విజయం సాధించాలి లాంటి పెద్ద మనిషి తరహా ట్వీట్ చేసి ఊరుకున్నారు.
కానీ సమాధానాలు రాని ప్రశ్నలు అలాగే వున్నాయి. పారలల్ లైఫ్ సబ్జెక్ట్ ఒక్కక్షణం సబ్జెక్ట్ ఒకటా కాదా?
మరి అలా అయితే రైట్స్ కొనుక్కున్న సబ్జెక్ట్ ఏం చేసుకోవాలి. ఆ లాస్ సంగతేమిటి?
ఇద్దరి మధ్య అసలు ఒప్పందం ఏమిటి?
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ కు ఒక్క క్షణం డైరక్టర్ ఆనంద్ ఓ సినిమా చేస్తారు. అయితే అది ఇప్పుడే చేస్తారా? తరువాత చేస్తారా? అన్నది క్లారిటీ లేదు. ఎందుకంటే తరువాతి సినిమా అరవింద్ కు చేయాల్సి వుంది. పైగా సినిమాను నేరుగా ఎకెకు చేయరు. చక్రి చిగురుపాటికి, ఎకె కె కలిపి చేస్తారు. అంతకు మించి ఇక వేరే ఆర్థిక లావాదేవీలు లేవు.
ఈ మాత్రం దానికి ఇంత హడావుడి అవసరమా? ఆనంద్ ఏమయినా మరీ అరడజను సినిమాలు చేతిలో వుంచుకున్న డైరక్టర్ కాదు కదా? అరవింద్ సినిమా చేయమని అడిగితే ఆనందంగా చేస్తాడు. దాని కోసం ఈ నోటీసులు, హల్ చల్ అవసరమా? ఏమిటో పాపం, ఎకె ఎంటర్ టైన్ మెంట్స్. వ్రతం చెడుతుంది తప్ప ఫలితం దక్కదు.