తన పుట్టినరోజు సందర్భంగా ఆమధ్య కొత్త సినిమా ఎనౌన్స్ చేశాడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్. రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించాడు. అప్పట్లో బెల్లంకొండ అలా ప్రకటించగానే అంతా ముక్కున వేలేసుకున్నారు. దాదాపు ఫేడ్ అవుట్ అయిపోయిన రమేష్ వర్మను పిలిచిమరీ అవకాశం ఇవ్వడమేంటని ఆశ్చర్యపోయారు.
మాటిచ్చినట్టుగానే రమేష్ వర్మతో కలిసి సెట్స్ పైకి వచ్చాడు బెల్లంకొండ. అతడి దర్శకత్వంలో రాట్ససన్ అనే తమిళ సినిమా రీమేక్ ను స్టార్ట్ చేశాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. తన సెలక్షన్ పై విమర్శలు వచ్చిన వెంటనే ట్రాక్ మార్చాడట ఈ హీరో.
అవును.. నిజానికి రమేష్ వర్మ వచ్చింది ఈ రీమేక్ ను డైరక్ట్ చేయడానికి కాదు. అతడొక కొత్త కథను వినిపించాడు. దానికి బెల్లంకొండ కూడా ఓకే చేశాడు. అంతలోనే నలుగురి నుంచి వచ్చిన విమర్శలు, సలహాల్ని దృష్టిలో పెట్టుకొని ఆ కథను పక్కనపెట్టేశాడట. అప్పుడే తన వద్దకు వచ్చిన ఈ రీమేక్ బాధ్యతల్ని రమేష్ వర్మకు అప్పగించాడట.
ప్రస్తుతానికైతే ఉపాధి హామీ పథకం కింద రమేష్ వర్మకు ఓ సినిమా దొరికింది. కాకపోతే.. అతడు రాసుకున్న కొత్త కథ పరిస్థితేంటి? ఈ దర్శకుడికి బెల్లంకొండ మరో ఛాన్స్ ఇస్తాడా?